వరంగల్ (కరీమాబాద్): రాష్ట్రం కాని రాష్ట్రంలో తెలుగు వాడు కనిపించడమే గగనమనుకుంటున్న సందర్భంలో నీది తెనాలే.. నాది తెనాలే.. అంటూ సొంత ఊరి వారిని మోసం చేయడానికి ప్రయత్నించిన ముఠా చేసిన అల్లరి... అంతా ఇంతా కాదు (ఇంద్రా సినిమా గుర్తుందా).. అచ్చం ఇలాంటి సంఘటనే తాజాగా వరంగల్‌లో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన సందీప్ తల్లిదండ్రులు గత కొన్నేళ్లుగా గుజరాత్‌లో ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన సందీప్ తిరిగి స్వస్థలానికి చేరుకోవడానికి అహ్మదాబాద్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో పరిచయమయిన బంటు సైదులు తనది నల్గొండ జిల్లా సుర్యాపేట అని చెప్పాడు. నీది నల్గొండే నాది నల్గొండే అని సరదాగా మాట్లాడాడు. దీంతో అతన్ని నమ్మిన సందీప్ అతనితో మాట కలిపాడు. గుజరాత్ నుంచి సందీప్ డబ్బు తీసుకొని వస్తున్నాడని గమనించిన బంటు సైదులు ఎలాగైనా దాన్ని కొట్టేయాలని పథకం వేశాడు. సోమవారం ఉదయం ట్రైన్ వరంగల్ చేరుకున్న సమయంలో సందీప్ బాత్‌రూంకు వెళ్లిన సమయం చూసి చాకచక్యంగా అతని బ్యాగ్‌లో ఉన్న లక్ష రూపాయలు తన బ్యాగ్‌లోకి మార్చాడు. డబ్బు పోయిందని గమనించిన సందీప్ లబోదిబోమంటుంటే ఇదంతా గమనించిన పక్క సీటు వ్యక్తి బంటు సైదులు నిజ స్వరూపాన్ని బయటపెట్టడంతో అసలు విషయం తెలిసింది. దీంతో అప్రమత్తమైన రైల్వే గార్డులు బంటు సైదులును వరంగల్ పోలీసులకు అప్పగించారు.