
పథకం ప్రకారమే హత్య..!
గృహిణి స్వప్నశ్రీ హత్యతో మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు
* స్వప్నశ్రీ హత్యతో ఉలిక్కిపడిన
* మోమిన్‌కలాన్ గ్రామస్తులు
* ధారూరు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.?
ధారూరు: గృహిణి స్వప్నశ్రీ హత్యతో మండల పరిధిలోని మోమిన్‌కలాన్ గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గ్రామానికి చెందిన రాజుగుప్త ఆమెను మహబూబ్‌నగర్ జిల్లా బొంరాస్‌పేట్ సమీపంలో హత్య చేశాడు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండల కేంద్రానికి చెందిన నందారం మిడిదొడ్డి రాజేందర్, మురళమ్మ దంపతుల రెండో కూతురు స్వప్నశ్రీ(32)ని 17ఏళ్ల క్రితం మోమిన్‌కలాన్‌కు చెందిన రాజుగుప్తా వివాహం చేసుకున్నాడు.
వీరికి పిల్లలు వినీత, భరత్‌లు ఉన్నారు. రాజుగుప్త కిరాణావ్యాపారం చేస్తూ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం స్వప్నశ్రీ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేసి అనంతరం మానేసి ఇంట్లోనే ఉండేది. కొంతకాలంగా రాజుగుప్తా వివాహేతర సంబంధాలు నెరుపుతున్నాడు. తనకు తెలియకుండా రహస్యంగా స్వప్నశ్రీ సెల్‌ఫోన్ మాట్లాడుతోందని.. ఆమెకు వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించాడు. దీంతో దంపతులు గొడవపడుతున్నారు. ఇరువర్గాల పెద్దలు సముదాయించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో స్వప్నశ్రీ గ్రామంలోనే మామ(రాజుగుప్తా తండ్రి)తో కలిసి వేరుగా ఉంటోంది.
ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం స్వప్నశ్రీ వేరొకరితో సన్నిహితంగా ఉండగా రాజుగుప్తా రెడ్‌హ్యాండెడ్‌గా చూశాడు. దీంతో ఎలాగైనా భార్యను చంపేయాలని అతడు పథకం వేశాడు. ఈక్రమంలో ఆయన సోమవారం రాత్రి పరిగిలో మద్యం తాగి వచ్చాడు. తండ్రి ఇంటికి వెళ్లి స్వప్నశ్రీని పుట్టింటికి తీసుకెళ్తానని నమ్మించాడు. తన ఇండికా కారు(ఏపీ 22జే 1332)లో ఎక్కించుకుని రాత్రి 9:30 గంటలకు బయలుదేరాడు. వాహనంలోనే భార్యను చంపిన ఆయన మార్గమధ్యలో బొంరాస్‌పేట్ సమీపంలో సంగయ్యగుట్ట శివాలయం వద్ద కారు నిలిపివేశాడు.
మృతదేహాన్ని పడేసి పెట్రోల్‌తో నిప్పంటించాడు. అనంతరం తన అన్నదమ్ములతో పాటు అత్తగారింటి బంధువులకు ఫోన్ చేసి స్వప్నశ్రీ హత్య విషయం చెప్పాడు. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పిన రాజుగుప్తా అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారీ అయ్యాడు. మంగళవారం మహబూబ్‌నగర్ పోలీసులు స్వప్నశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా బుధవారం రాత్రి నిందితుడు రాజుగుప్తా తన కారులో వచ్చి ధారూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. కాగా తల్లి హత్యకు గురవడం.. తండ్రి జైలు పాలుకానున్న నేపథ్యంలో దంపతుల పిల్లలు వినీత, భరత్‌లు అనాథలయ్యారు. పచ్చని కుటుంబంలో వివాహేతర సంబంధాలు నిప్పుపెట్టాయని గ్రామస్తులు తెలిపారు.