ప్రజా సమస్యలపై కార్యాచరణ
13న గవర్నర్, 14న కేసీఆర్‌కు వినతిపత్రాలివ్వాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయం
రుణమాఫీ, విద్యుత్, ఫీజుల అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ఎంపీ పొంగులేటి
పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, మహిళలు, దళితులు, కార్మికులు ఇతర వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టేందుకు వైఎస్సార్‌సీపీ తెలంగాణ శాఖ సిద్ధమైంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈనెల 13న గవర్నర్ నరసింహన్‌ను, 14న సీఎం చంద్రశేఖర్‌రావును కలిసి పార్టీ తెలంగాణ నాయకులు వినతిపత్రాలను సమర్పించనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చాలా సందర్భాల్లో విజ్ఞప్తి చేసినా వాటి అమలు మొదలుకాలేదని పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రుణమాఫీ, విద్యుత్, విద్యార్థులకు ఫీజుల చెల్లింపు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారె డ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్మ కిష్టారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, నల్లా సూర్యప్రకాష్, కె.శివకుమార్, గట్టురామచంద్రరావు, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, హెచ్‌ఏ రెహ్మాన్, బి.జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. పార్టీకి అండగా ఉండేందుకు వైఎస్ షర్మిలను, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పొంగులేటిని నియమించినందుకు రాష్ర్ట కమిటీ సభ్యులు పార్టీ అధ్యక్షుడు జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరులో సరస్వతి పవర్ కంపెనీ కోసం జగన్ కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ లీజును రద్దు చేయడాన్ని, రైతులను పనిగట్టుకుని ఉసిగొల్పడాన్ని ఖండిస్తూ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది.
పార్టీ బలోపేతంపై చర్చలు
ఈనెల 16 నుంచి 25 వరకు పది జిల్లాల సమావేశాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తామని పొంగులేటి తెలిపారు. 8న పార్టీ అధ్యక్షుడు జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను గ్రామస్థాయికి తీసుకెళ్తామన్నారు.
జిల్లాల వారీగా సమావేశాలివీ..
ఈనెల 16న ఉదయం మహబూబ్‌నగర్, మధ్యాహ్నం వరంగల్, 18న ఉదయం నల్లగొండ, మధ్యాహ్నం కరీంనగర్, 19న హైదరాబాద్, 20న ఉదయం రంగారెడ్డి అర్బన్, మధ్యాహ్నం రంగారెడ్డి రూరల్, 21న ఉదయం మెదక్, మధ్యాహ్నం ఖమ్మం, 25న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల సమావేశాలు ఉంటాయని రాష్ర్ట కమిటీ సభ్యులు శివకుమార్ తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్- రెహ్మాన్, కె.శివకుమార్, ఆదిలాబాద్, వరంగల్ -రాఘవరెడ్డి, కరీంనగర్, మెదక్- జనక్ ప్రసాద్, నల్లగొండ, ఖమ్మం-నల్లా సూర్యప్రకాష్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ - గట్టు శ్రీకాంత్‌రెడ్డి సమావేశాల జిల్లా కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని చెప్పారు.
చంద్రబాబువి చిల్లర రాజకీయాలు: గట్టు
ఏపీ సీఎం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర కమిటీ సభ్యుడు గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. ‘‘జగన్.. సరస్వతి పవర్ కంపెనీ భూములు న్యాయబద్ధంగా కొనుగోలు చేశారు. రైతులను రెచ్చగొట్టే చర్యలను వైఎస్సార్‌సీపీ తెలంగాణ శాఖ ఖండిస్తోంది. సరస్వతి కంపెనీకి అనుమతినివ్వకుండా మరోవైపు రైతులను రెచ్చగొట్టి పంపిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ భూములను గుంజుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేయగలరా? ఆయనకు ఆ దమ్ముందా?’’ అని ఆయన ప్రశ్నించారు.