ప్రజల కష్టాలు తీర్చకుంటే ఉద్యమ బాట
వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ హెచ్చరిక
రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం
హైదరాబాద్: తెలంగాణ ప్రజల కష్టాలను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించకుంటే ఉద్యమ బాట పడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వినతి పత్రం అందజేశారు. రైతుల ఆత్మహత్యలు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాలని, సంక్షేమాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం రాజ్‌భవన్ ఎదుట ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, వారి సమస్యలను పాలకపక్షం పట్టించుకోనప్పుడు బాధ్యత కల్గిన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ వ్యవహరిస్తుందన్నారు. అందులో భాగంగానే గవర్నర్‌ను కలిశామన్నారు.
విద్యుత్తు కోతల ఫలితంగా వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలు కుదేలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ అడిగామని, సమయం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ తెలంగాణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఎడ్మ కిష్టారెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కె. శివకుమార్, డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, హెచ్‌ఏ. రహమాన్, బి.జనక్ ప్రసాద్ తదితరులు ఉన్నారు.