
సాక్షి, హైదరాబాద్ : ‘నేను ఈ రోజు ప్రాణాలతో ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం నా ధైర్యమే.. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. ధైర్యంగా సరైన చికిత్స తీసుకుంటే నయమవుతుంది. గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ సినీనటి గౌతమి అన్నారు. లైఫ్ అగెయిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విన్నర్స్ వాక్ సందడిగా సాగింది.
బ్రెస్ట్ కేన్సర్‌ను ఎదిరించి విజయం సాధించిన సినీనటి గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులతో పాటు కేన్సర్‌ను జయించిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తగిన చికిత్స చేయించుకుంటే నయమవుతుందని సీనియర్ నటి జయసుధ పేర్కొన్నారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు సాగాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. మువీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజి రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, ముమైత్‌ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.