మనకు 'సౌందర్య' దూరమై పదేళ్లు
కరీంనగర్ పర్యటనకు వస్తూ ప్రమాదానికి గురైన వైనం
దశాబ్దకాలం.. స్మృతిపథం..
సినీనటి సౌందర్య కరీంనగర్ జిల్లాలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న బెంగళూర్ నుంచి హెలికాప్టర్‌లో వస్తుండగా ప్రమాదానికి గురై దుర్మరణం చెందిన సంఘటన ఇప్పటికీ స్మృతిపథంలో మెదులుతూనే ఉంది. ఎన్నికలు అనగానే ప్రచార ఆర్భాటం, సినీగ్లామర్ తోడవడం సహజం. కానీ 2004 ఎన్నికల్లో అప్పటి బీజేపీ అభ్యర్థి చెన్నమనేని విద్యాసాగర్‌రావు పక్షాన ప్రచారం చేసేందుకు సౌందర్య బెంగళూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ ప్రమాదానికి గురై కుప్పకూలింది.
ఆ మంటల్లో ప్రేక్షకుల అభిమాన నటి సజీవ దహనమైంది. ఏప్రిల్ 17న ఉదయమే బెంగళూర్ నుంచి బయల్దేరిన సౌందర్య మధ్యాహ్నం 3గంటలకు ముస్తాబాద్ రోడ్‌షోలో పాల్గొనాల్సి ఉంది. అనంతరం 4.30గంటలకు ఎల్లారెడ్డిపేట రోడ్‌షోలో ప్రచారం చేయాలి. సాయంత్రం 5.30గంటలకు సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి. రాత్రి 7గంటలకు కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ బహిరంగ సభలో సౌందర్య ప్రసంగించాల్సి ఉంది. కానీ, విధి వక్రీకరించి ఆమెను బలితీసుకుంది. ప్రచార సభలు కాస్తా.. సంతాప సభలుగా మారిపోయాయి. ఎన్నికల ప్రచారానికి కరీంనగర్ బయల్దేరిన సౌందర్య నేలరాలడం ఇప్పటికీ జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటారు.