పెట్రోల్, డీజిల్ పై ‘లెవీ’ మోత!
దొడ్డిదారిన రూ.480 కోట్లు సమకూర్చుకునేందుకు సర్కారు ఎత్తుగడ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అదనపు పన్నుల ద్వారా రూ.480 కోట్లు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘లెవీ’ విధించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. రాష్ట్రంలో విక్రయించే పెట్రోల్, డీజిల్‌లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న పన్నులకు అదనంగా లీటర్‌పై ఒక రూపాయి ‘లెవీ’ విధించాలని సూచించింది. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా... ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేయడమే మిగిలింది. పెట్రోల్, డీజిల్‌లపై వాణిజ్య పన్నుల శాఖ వసూలు చేస్తున్న వ్యాట్‌కు ఈ ‘లెవీ’ అదనం.
ఏటా రూ.6,500 కోట్లు
రాష్ట్రంలో వినియోగమవుతున్న పెట్రోల్, డీజిల్‌పై ‘వ్యాట్’ ద్వారా 2015 ఏప్రిల్ నుంచి 2016 ఫిబ్రవరి వరకు రూ.5,956 కోట్లు వసూలైంది. మార్చి నెలలో మరో రూ.550కోట్ల వరకు రావచ్చని అధికారుల అంచనా. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్ ద్వారానే ఈ మొత్తం సమకూరింది. వాస్తవానికి 2015-16లో పెట్రోల్, డీజిల్‌మీద రూ.7,850కోట్లు వస్తుందని అంచనా వేయగా... ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో సుమారు రూ.6,500కోట్ల (82 శాతం) వరకు వసూలవుతోంది.
ఈ నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో వెయ్యి కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు ఒక రూపాయి చొప్పున ‘లెవీ’ వసూలు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.480కోట్లు వసూలవుతుందని అంచనా వేశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచకుండా రూ.4 అదనంగా వసూలు చేస్తున్నారు. అలా తెలంగాణలో కన్నా లీటరుకు ఒక రూపాయి ఎక్కువగా సమకూరుతోంది. దీంతో వ్యాట్‌ను పెంచడం కన్నా, ‘లెవీ’ వసూలు చేయడమే మేలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎంవోలో ఉన్నట్లు సమాచారం.
మరిన్ని అంశాల్లోనూ..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ వసూళ్ల లక్ష్యం రూ.42,073కోట్లుగా తాజా బడ్జెట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2015-16) సంబంధించి ఫిబ్రవరి వరకు రూ.27,873 కోట్లు వసూలుకాగా... ఈనెలాఖరుకల్లా మరో రూ.3వేల కోట్లు సమకూరుతుందని అంచనా. అయితే పెరిగిన వసూళ్ల అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూర్చుకునే పనిలో వాణిజ్య పన్నుల శాఖ పడింది. లీజు లావాదేవీలపై పన్నుల ద్వారా రూ.60కోట్లు సమకూర్చుకునే బిల్లును ఇటీవలే అసెంబ్లీ ఆమోదించింది.
ఇన్‌వాయిస్ ట్రాకింగ్ విధానం ద్వారా రూ.120కోట్లు వసూలు చేసే ప్రతిపాదనను మే నుంచి అమలు చేయనున్నారు. డీటీహెచ్ మీద వినోదపన్ను రూపంలో మరో రూ.24 కోట్లు, హెచ్‌ఆర్‌బీటీ చట్టం అమలు ద్వారా రూ.10 కోట్లు, కేబుల్ కనెక్షన్లపై వినోద పన్నును రూ.5 నుంచి రూ.10కి పెంచడం ద్వారా మరో రూ.20 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించింది. మొత్తంగా రూ.864 కోట్లు అదనంగా వసూలు చేసే ఈ ప్రతిపాదనల్లో కొన్ని ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే వాటికి ఆమోదం లభించనుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.
ధాన్యం సేకరణ పన్నుపైనా లెవీ
రైతుల నుంచి ధాన్యం సేకరణపై కొనుగోలు పన్ను (పర్చేస్ ట్యాక్స్)ను ఇప్పటికే వసూలు చేస్తుండగా, అదనంగా ‘లెవీ’ వసూలు చేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రతిపాదించింది. తద్వారా ఏడాదికి రూ.150కోట్లు వసూలవుతుందని భావిస్తున్నారు. రైతు పండించిన పంటకు ఎలాంటి పన్ను వసూలు చేయని ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి విక్రయించే వారిపైన, రైస్‌మిల్లర్లు, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారిపై పన్ను విధిస్తోంది. తద్వారా వసూలవుతున్న పన్నుకు అదనంగా ‘లెవీ’ని విధించనుంది.