తూర్పు జిల్లాలో కరెంటు కష్టాలు తీరనున్నాయి. ప్రజలకు సోలార్ వెలుగులు అందనున్నాయి. దీంతో ఈ ప్రాంత వాసులకు నిత్యం కరెంటు సరఫరా కానుంది
నెన్నెల : తూర్పు జిల్లాలో కరెంటు కష్టాలు తీరనున్నాయి. ప్రజలకు సోలార్ వెలుగులు అందనున్నాయి. దీంతో ఈ ప్రాంత వాసులకు నిత్యం కరెంటు సరఫరా కానుంది. నెన్నెలలో సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉండడం.. సంప్రదాయ విద్యుత్‌కు పెరిగిన డిమాండ్ దృష్ట్యా.. ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి నెన్నెలలో ఇప్పటికే భూసేకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని అడ్డంకులూ తొలగి.. ప్లాంటు ఏర్పాటైతే తూర్పు జిల్లా సౌర విద్యుత్ వెలుగుల్లో తళుకులీననుంది. ఈ ప్రాజెక్టుతో తూర్పు జిల్లాకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ప్రభుత్వం లక్ష్యం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కలుగుతున్న అవరోధాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
భూ సేకరణకు ఆదేశాలు..
నెన్నెల, బొప్పారం గ్రామాల శివార్లలోని సర్వేనంబర్లు 671లో 457.32 ఎకరాలు, 672లో 550.15 ఎకరాల భూమిని గతంలో చేసిన సర్వేలో గుర్తించారు. ప్రభుత్వ సూచన మేరకు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న భూములను సత్వరం గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు భూముల సర్వేలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. నెన్నెల మండల కేంద్రంలో సోలార్ పవర్ ప్లాంటు కోసం ప్రతిపాదించిన భూమిలో చేపడుతున్న సర్వేను మంచిర్యాల ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం ప్రత్యేక దృష్టి సారించారు. భూసేకరణ కోసం సర్వే పనులు వే గవంతంగా నడుస్తున్నాయి.దీంతో ఇన్నాళ్లు పెండింగ్‌లో ఉన్న సోలార్ పవర్ ప్లాంటు పనులపై జిల్లా వాసులకు ఆశలు చిగురిస్తున్నాయి.
జిల్లాలో 3.54 లక్షల భూమి గుర్తింపు
జిల్లాలో ఏర్పాటు చేయనున్న పరిశ్రమల్లో భాగంగా నెన్నెల మండల కేంద్రంలో నిర్మించతల పెట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టే పెద్దది కావడం విశేషం. నెన్నెలలో ప్రభుత్వ భూమి లభ్యత అధికంగా ఉండటంతో ఇక్కడ పరిశ్రమ పెట్టేందుకు ప్రైవేటు సంస్థలూ పోటీపడుతున్నాయి. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి వంద నుంచి 400 ఎకరాల వరకే ఉండగా.. నెన్నెలలో మాత్రం వెయ్యి ఎకరాలకు పైగా ఉంది. జిల్లాలో 3.54 లక్షల వ్యవసాయేతర భూమి ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. దీంట్లో 58,852 ఎకరాల భూమి సర్వే ఈ పాటికే పూర్తయింది. ఇందులో 11,212 ఎకరాల్లో వివిధ పరిశ్రమలకు పనికి వచ్చేదిగా గుర్తించారు. 47,646 ఎకరాల భూమి పరిశ్రమలకు అనుకూలంగా లేదని తేల్చారు. నెన్నెల మండలంలో 1008 ఎకరాలు, చెన్నూరులో 460 ఎకరాలు, సారంగాపూర్ మండలం ఆలూరులో 239, కాగజ్‌నగర్ అంకుసాపూర్‌లో 230 ఎకరాలు, కుభీర్ మండలంలో 114 ఎకరాలు, సిర్పూర్(టి)లో 100 ఎకరాల భూమి పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు.
సోలార్ పవర్ ప్రాజెక్టుతో బోలెడు ప్రయోజనాలు
సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో ఖర్చులు గణనీయంగా తగ్గడంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఉండదు. మరో పక్క తూర్పు జిల్లాకు నిరంతరంగా విద్యుత్‌ను సరఫరా చేయడానికి అవకాశాలు ఉంటాయి. నెన్నెల ప్రాంతంలో సౌరశక్తి గంటలు అధికంగా ఉండటం అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో బొప్పారం ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలని తలచారు. సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేస్తే సుమారు 70 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు మరో 200 మంది పరోక్షంగా జీవనోపాధి లభించనుంది. ఈ విషయమై ఆర్డీవోను వివరణ కోరగా.. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.