తరువాత మీ వాడినేగా ... పోటీ పెట్టకండి!
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. శాసనసభ్యుల కోటాలో ఖాళీ అయిన ఆరు సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. న్యాయంగా అయితే వీటిలో 4 టీఆర్‌ఎస్‌కు, ఒకటి కాంగ్రెస్, మరోటి టీడీపీ-బీజేపీ కూటమికి చెందాలి. పోటీ జరిగితే ఒక ఎమ్మెల్సీకి 18 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. అయితే టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం 11కు పడిపోయింది. బీజేపీ కలిస్తే 16 అవుతుంది. శాసనమండలిలో టీడీపీ ఊసు లేకుండా చేయాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఐదో ఎమ్మెల్సీకి పోటీ పడితే పరిస్థితి ఎలా అని పసుపు శిబిరం ఆందోళన చెందుతోంది. ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇద్దరు లేదా ముగ్గురు గులాబీ అభ్యర్థికే ఓటేస్తారేమోనని లోలోపల భయం కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లో ఓ మాజీ ప్రతినిధి రంగంలోకి దిగాడట. టీఆర్‌ఎస్ ముఖ్య నేతల్లో ఒకరిని కలిసి బంపర్ ఆఫర్ ఇచ్చారట. ‘ఎమ్మెల్సీగా నాకే బాబు అవకాశం ఇస్తాడు. పోటీ పెట్టకండి. ఎమ్మెల్సీ అయిన ఆరు నెలల్లోపు అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరుతా. ఆ పార్టీ నుంచి నేనొక్కన్నే ఉంటా కాబట్టి ఫిరాయింపుల చట్టం కూడా వర్తించదు’ అని చెప్పాడట. ఈ విషయం ఎమ్మెల్సీ టిక్కెట్టు ఆశిస్తున్న మరో నాయకుడికి తెలిసి బాబు చెవిన వేసినట్టు టీడీపీలో గుసగుసలు...