
సాక్షి, హైదరాబాద్: జనవరి నాలుగో వారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల సహకార శాఖ అధికారులకు రిజిస్ట్రార్, కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్యాక్స్‌లలో ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ముద్రించాలని, వాటిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను ఈ నెల 21 వరకు స్వీకరించాలని పేర్కొన్నారు. పర్సన్ ఇన్‌చార్జి కమిటీ వాటన్నింటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాల్సి ఉంది. జాబితాను ఈ నెల 23న సహకార శాఖ రిజిస్ట్రార్ ఆమోదానికి పంపాలి. రాష్ట్ర స్థాయిలో సహకార శాఖ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. వాటిన్నింటిని పరిష్కరించి 28వ తేదీన ఆమోదం తెలపనున్నారు. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జనవరి 15 నుంచి లేదా నాలుగో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 906 ఫ్యాక్స్‌లు ఉన్నాయి. వీటికి ఇప్పుడు పర్సన్ ఇన్‌చార్జ్‌లు పాలక వర్గాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో ముగిశాయి. మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది.
హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ..
గతంలో మాదిరి కాకుండా ఈసారి ఎన్నికలు వేరుగా జరగనున్నాయి. 1964 సహకార చట్టంలోని ఎన్నికల ప్రక్రియను తెలిపే 22వ నియమానికి సవరణలు ప్రభుత్వం గతంలో సవరణలు చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచే ఎన్నికల అధికారులను నియమించి పర్యవేక్షణ చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యయాన్ని ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానానికి సవరణలో స్వస్తి చెప్పారు. లోటుపాట్లు, అవినీతి చోటు చేసుకుంటున్నందున ఎలక్షన్ నిర్వహణ వ్యయం మొత్తం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచే వెళ్తోంది.