హైదరాబాద్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ నిజ జీవిత చరిత్రను సీరియల్‌గా దూరదర్శన్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 2 నుంచి దూరదర్శన్ యాదగిరి ఛానల్‌లో ప్రసారం చేయనున్నట్టు దర్శక నిర్మాత నాగబాల సురేష్‌కుమార్ చెప్పారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలుగు టీవీ ఫెడరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన చాకలి ఐలమ్మ సీరియల్ విశేషాలను తెలియజేశారు.
మంగళవారం రాత్రి 7-30 గంటలకు ఇది ప్రసారమవుతుందని, డైలీ సీరియల్‌గా ఈ ధారావాహిక కొనసాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిని అదేరోజు ప్రసారం చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. పెత్తందారీ వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయాలనే కసితో, నిజాం దొరలను చీల్చి చెండాడాలనే చైతన్యంతో ఉద్యమించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని ఆమె తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ స్పూర్తి ప్రదాత అని తెలియజేశారు.