ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం రెండింతలు | Aim to double time food production agriculter department | Sakshi
Sakshi News home page

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం రెండింతలు

Published Thu, Jun 16 2016 2:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం రెండింతలు - Sakshi

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం రెండింతలు

97 లక్షల టన్నులకు పెంచాలని సర్కారు నిర్ణయం
2016-17 వ్యవసాయ ప్రణాళిక ఆవిష్కరించిన మంత్రి పోచారం
పప్పుధాన్యాల ఉత్పత్తి మూడింతలకు పెంచాలని లక్ష్యం
పత్తి సాగు తగ్గించి సోయా సాగు పెంచేందుకు ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని రెండింతలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘2016-17 వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక’ను బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ విడుదల చేసింది. రెండేళ్లుగా కరువు కారణంగా రాష్ట్రంలో పంటలు పండక రైతులు కుదేలయ్యారు. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న అంచనాలతో వ్యవసాయశాఖ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2015-16 వ్యవసాయ సీజన్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 48.62 లక్షల మెట్రిక్ టన్నులుండగా... ఈ ఏడాది 97.41 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గతేడాది కంటే అదనంగా 48.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. అందులో వరి ఉత్పత్తే అధికంగా ఉండటం గమనార్హం. 2015-16లో వరి ఉత్పత్తి 39 లక్షల మెట్రిక్ టన్నులు (బియ్యం ఉత్పత్తి 29.33 లక్షల మెట్రిక్ టన్నులు) కాగా... 2016-17లో 72.39 లక్షల మెట్రిక్ టన్నుల వరి (బియ్యం ఉత్పత్తి 55.43 మెట్రిక్ టన్నులు) పండించాలని నిర్దేశించుకున్నారు. అంటే అదనంగా 33.39 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం (బియ్యం ఉత్పత్తి 26.1 లక్షల మెట్రిక్ టన్నులు) పండించాల్సి ఉంటుంది.

అలాగే గతేడాది 2.25 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను పండించగా... ఈసారి 5.78 లక్షల పప్పుధాన్యాలు పండించాలని భావిస్తున్నారు. ఏకంగా మూడింతల పప్పుధాన్యాలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది 5.05 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి సాధించగా... ఈసారి పత్తి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలని నిర్ణయించినందున 3.81 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేయాలని నిర్ణయించారు.

 మూడింతల సోయా సాగుకు ఏర్పాట్లు..
పత్తి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించాలని రైతులకు పిలుపునిచ్చిన వ్యవసాయశాఖ అందుకు తగ్గట్లుగా ప్రణాళిక రచించింది. గతేడాది పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 40.31 లక్షల ఎకరాలు కాగా... ఈసారి 26.28 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. దానికి ప్రత్యామ్నాయంగా సోయాసాగు విస్తీర్ణాన్ని మూడింతలకు పెంచాలని ప్రణాళికలో పేర్కొన్నారు. 2015-16లో సోయా సాధారణ సాగు విస్తీర్ణం 4.39 లక్షల ఎకరాలు కాగా... ఈసారి సాగు విస్తీర్ణాన్ని 12.39 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు.

 త్వరలో మూడో విడత రుణమాఫీ..
త్వరలో రైతులకు మూడో విడత రుణమాఫీ అమలుచేస్తామని... అందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికశాఖను ఆదేశించారని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలో ‘2016-17 వ్యవసాయ ప్రణాళిక’ను ఆవిష్కరించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణమాఫీకి రైతులకు సంబంధం లేదని... అది ప్రభుత్వానికి, బ్యాంకులకు సంబంధించిన వ్యవహారమని ఆయన వివరించారు. కాబట్టి బ్యాంకులు రైతులను అడగ వద్దన్నారు. ఇప్పటికే బ్యాంకులు రూ. వెయ్యి కోట్ల పంట రుణాలు ఇచ్చాయన్నారు.

అకాల వర్షాలు, గాలులతో గ్రీన్‌హౌస్ నిర్మాణాలు ధ్వంసమైతే రైతులకు బీమా చెల్లించేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. సూక్ష్మసేద్యం కోసం ప్రభుత్వం తన వాటాతో కలిపి నాబార్డుతో కలసి రూ. 1,300 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. వచ్చే కేబినెట్ భేటీలో ఉద్యాన పోస్టులకు అనుమతి లభిస్తుందన్నారు. ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్.. తదితరాలను పరిశీలించేందుకు జూలై నెలలో పోలాండ్, జర్మనీ, డెన్మార్క్ దేశాలకు వెళ్తామన్నారు. ఉద్యాన కార్పొరేషన్‌లో వివిధ విభాగాలకు ఐదారుగురు అదనపు డెరైక్టర్లను నియమిస్తామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు ఈ ఏడాది రూ. 335 కోట్లు కేటాయించామన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యాన కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement