
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఆయన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్‌నగర్ జమాల్‌కాలనీలో నిర్మించనున్న ఒవైసీ జూనియర్ కాలేజీ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. మరోసారి చావు దగ్గరకు వెళ్లిన తనను ప్రజల ఆశీస్సులే బతికించాయన్నారు. ప్రజలకు సేవే జీవిత లక్ష్యమని, అందుకే తాను తిరిగి వచ్చానన్నారు. మళ్లీ పునర్జన్మ ప్రసాదించడమంటే ప్రజలకు తాను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్న మాట అని పేర్కొన్నారు.తాను చనిపోయానంటూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపి ఆనందపడ్డారని, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు అలాంటివారి ఆశలు నెరవేరబోవన్నారు.
వెయ్యిమందికి ఉచితవిద్య
ఏదో ఒకరోజు చావడం ఖాయమని, అప్పటివరకు ప్రజల నడుమ ఉంటూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడమే తన కర్తవ్యమని అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే వెయ్యిమంది విద్యార్థులకు ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉచితంగా విద్యను అందిస్తున్నామని, ఇంటర్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. విద్యతోనే మనకు అన్ని రకాల గుర్తింపు లభిస్తుందని, ప్రతి కుటుంబంలోని పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలన్నారు. నియోజకవర్గంలో మరి న్ని ఎడ్యుకేషనల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. తన కుమార్తెను లండన్‌లో లా చదివి స్తున్నానని, ఆ యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచిందని చెప్పారు. తాను ఉన్నా లేకున్నా ఈ విద్యాసంస్థలను తన కుమారుడు, కుమార్తె చూసుకుంటారని తెలిపారు.