ఖమ్మం ఫస్ట్.. గార్ల లాస్ట్... | alchol shops selections are done by lottery method | Sakshi
Sakshi News home page

ఖమ్మం ఫస్ట్.. గార్ల లాస్ట్...

Published Mon, Jun 23 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

ఖమ్మం ఫస్ట్.. గార్ల లాస్ట్...

ఖమ్మం ఫస్ట్.. గార్ల లాస్ట్...

ఖమ్మం క్రైం:జిల్లాలో మద్యం దుకాణాల వేలం కోసం స్వీకరించిన దరఖాస్తులలో ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని రెండు షాపులు మొదటి స్థానంలో నిలిచాయి. ఖమ్మం ఖానాపురం హవేలీ షాపు నంబర్ 1, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం షాపులకు 111 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. గార్ల నుంచి తక్కువగా రెండు దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో అశ్వారావుపేట - షాప్ నంబర్ 2కు అత్యధికంగా 83 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెంలోని లక్ష్మీదేవిపల్లి షాపునకు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది. కొత్తగూడెం మండలం రుద్రంపూర్‌లో ఉన్న రెండు షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.
 
ఇక పెనుబల్లి, గుండాల మండలాల్లోని షాపులకు కూడా ఒక్క దరఖాస్తు రాలేదు. గత వారం రోజుల నుంచి మద్యం దుకాణాల వేలం పాటల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి టోకెన్‌లు ఇచ్చారు. ఇలా కొత్తగూడెం, బూర్గంపాడు స్టేషన్‌ల పరిధిలోని షాపులకు ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా ఎక్సైజ్ శాఖకు ఈ చలానాల ద్వారా సుమారు రూ.9.59 కోట్ల వరకు ఆదాయం లభించింది.
 
ఖమ్మం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 77 షాపులకు 2,373 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 14 షాపులకు 420, ఖమ్మం అర్బన్ బల్లెపల్లిలోని రెండు షాపులకు 41, ఖమ్మం రూరల్ మండలంలోని రెండు షాపులకు 180 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం అర్బన్ మండలంలోని వెంకటాయపాలెం షాపునకు 12, చింతకాని మండలంలోని షాపునకు 86, కూసుమంచిలోని మూడు షాపులకు 104, నేలకొండపల్లిలోని రెండు షాపులకు 114, ముదిగొండలోని రెండు షాపులకు 58, తిరుమలాయపాలెంలోని రెండు షాపులకు 45, వైరాలోని మూడు షాపులకు 84, తల్లాడలోని మూడు షాపులకు 113, బోనకల్‌లోని మూడు షాపులకు 47, కొణిజర్లలోని రెండు షాపులకు 91, మధిరలోని ఆరు షాపులకు 127, ఎర్రుపాలెంలోని రెండు షాపులకు 88, సత్తుపల్లిలోని 8 షాపులకు 258, కల్లూరు మండలంలోని మూడు షాపులకు 136, వేంసూరులోని ఒక షాపునకు 100, ఇల్లెందులోని 8 షాపులకు 107, సింగరేణి మండలంలోని రెండుషాపుల నుంచి 81 దరఖాస్తులు వచ్చాయి.
 
కాగా,  పెనుబల్లి, గుండాల మండలంలోని మూడు షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. బయ్యారం షాపునకు 46, టేకులపల్లి షాపునకు 06, కామేపల్లి మండలంలోని షాపునకు 35 దరఖాస్తులు, అలాగే కొత్తగూడెం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 70 షాపులకు 1464 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం స్టేషన్ పరిధిలోని 33 షాపులకు 527, దరఖాస్తులు వచ్చాయి. పాల్వంచలోని 9షాపులకు 264, మణుగూరులోని 13షాపులకు 157, అశ్వారావుపేట 8షాపులకు 299 దరఖాస్తులు, బూర్గంపాడులోని 4 షాపులకు 102, వెంకటాపురంలోని 5 షాపులకు 61, భద్రాచలంలోని 11 షాపులకు 54 దరఖాస్తులు వచ్చాయి.
 
నేడు లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు..
 
జిల్లాలోని 147 షాపులకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సీక్వెల్ ఫంక్షన్ హాల్‌లో లాటరీ పద్ధతిలో డ్రా తీస్తారు. ఇందులో గెలుపొందిన వారికి షాపులను కేటాయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్, ఎస్పీ ఎ.వి. రంగనాథ్ హాజరై లాటరీ పద్ధతిని ప్రారంబిస్తారు. అయితే భారీ సంఖ్యలో (3837) దరఖాస్తులు రావడంతో షాపుల కేటాయింపునకు రెండు రోజుల పట్టే అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు.
 
డ్రా తీసే ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీంచేందుకు సీసీ కెమెరాలు, వీడియో చిత్రీకరణతోపాటు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 250 మంది ఎక్సైజ్, రెవెన్యూ అధికారులు పాల్గొంటున్నారు.  షాపులు కేటాయించే క్రమంలో అధికారులు ఇచ్చిన హాల్‌టికెట్ ఉన్న దరఖాస్తుదారుడిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. మైకు ద్వారా షాపుల కేటాయింపు ప్రకటన చేస్తారు. పార్క్ హోటల్ ప్రాంతంలో వాహనాల పార్కింగ్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. బందోబస్తును ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. ఫంక్షన్‌హాలులో ఒకేసారి 14 స్టేషన్‌లకు సంబంధించి టెండర్ బాక్సులను ఓపెన్ చేసేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని డిప్యూటీ కమిషనర్ కె.మహేష్‌బాబు తెలిపారు.
 
మొదటిగా సింగిల్ డిజిట్ నెంబర్లను డ్రా తీస్తారని పేర్కొన్నారు. ఏజెన్సీలోని  షాపులకు తీర్మానాలు లేకపోతే కమిషనర్ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ కమిషనర్ మహేష్‌బాబు సీక్వెల్ ఫంక్షన్ హాలును పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎక్సైజ్ సూపరింటెండెంట్ గణేష్ , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రీతమ్, ఖమ్మం డీఎస్పీ బాలకిషన్‌రావు, వన్‌టౌన్ సీఐ రమణమూర్తి, ట్రాఫిక్ ఎస్‌ఐ గోపి తదితరులున్నారు.   
 
మాటేసిన డాన్‌లు..

మద్యం షాపులకు టెండర్లు నిర్వహిస్తున్న తరుణంలో మద్యం డాన్‌లు చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు. తాము టెండర్ దాఖలు చేసిన షాపులు దక్కకపోతే డ్రాలో గెలుపొందిన వారినుంచి షాపులు చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా తమకు అనుకూలమైన షాపులను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
 
అప్పడే మొదలైన కొత్త షాపుల ప్రతిపాదన లు..!
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో ఉన్న 9 షాపులను సీమాంధ్రకు కలిపారు. వాటికి బదులుగా జిల్లాలో మరో 9 కొత్త షాపులు ఏర్పాటుకు ఇప్పటికే అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. మొదటి విడతగా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం లేదా మద్దులపల్లి, చింతకాని, నేలకొండపల్లి మండలాల్లో మూడు షాపులకు జాలై మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు ఫైల్ సిద్దం చేసినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement