దుబ్బాక,న్యూస్‌లైన్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో అందరి దృష్టి దుబ్బాక నియోజకవర్గంపైనే ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్యన నువ్వా..నేనా అన్నట్లుగా పోటీ ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట రామలింగారెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్ గుప్తా పోటీ చేశారు. వీరితో పాటు బీఎస్పీ నుంచి రాచకట్ల లక్ష్మి, ఎంఎస్పీ నుంచి గడ్డం మోహన్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే.
వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. వీరితో పాటు బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చాపకింద నీరులా ప్రచారం నిర్వహించి ఓటు బ్యాంకునుపెంచుకున్నారు. అయితే కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్ ఓట్లను బీజేపీ భారీగానే చీల్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి శ్రవణ్‌కుమార్‌కు దివంగత నేత వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మేలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చే స్తున్నారు.
ఇప్పటి వరకు ఆ ఇద్దరే ..
నియోజకవర్గంలో (గతంలో దొమ్మటగా ఉన్న సమయంలో నుంచి) చెరుకు ముత్యంరెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో టీడీపీ నుంచి చెరుకు ముత్యంరెడ్డి తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనంతరం 1994లో, 1999లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యట్రిక్ సాధించారు. అదేవిధంగా ముత్యంరెడ్డి (దుబ్బాకలో 2004 సార్వత్రిక, 2008 ఉప ఎన్నిక, 2005లో సిద్దిపేట ఉప ఎన్నికలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.) ఐదేళ్లలో వరుసగా మూడుసార్లు ఓటమి చెంది రికార్డుకెక్కారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి తొలిసారిగా పోటీ చేసి ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై విజయం సాధించారు. ఆనంతరం 2008 ఉప ఎన్నికలో కూడా చెరుకు ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటుతో ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు.
దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి ముత్యంరెడ్డికి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డిపై 2640 ఓట్లతో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యనే తీవ్ర పోటీ ఉంది. 2004 నుంచి 2014 ఎన్నికల వరకు అంటే మూడు సార్వత్రిక, ఒక ఉప ఎన్నిక జరిగింది. ఈ నాలుగు ఎన్నికల్లో కూడా ముత్యంరెడ్డి, రామలింగారెడ్డి మధ్యే పోటీ ఉండడం విశేషం. ఇప్పటి వరకు 2004 సార్వత్రిక ఎన్నికల్లో, 2008 ఎన్నికల్లో ప్రత్యర్థి ముత్యంరెడ్డిపై రామలింగారెడ్డి గెలుపొందారు. 2009లో రామలింగారెడ్డిపై ముత్యంరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు ఆ ఇద్దరిలో ఎవరికి విజయాన్ని అందిస్తారో వేచి చూడాల్సిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆ రెండు పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి తనకంటూ ప్రత్యేకత సాదించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అందరి దృష్టి దుబ్బాకపైనే
Published Mon, May 5 2014 11:41 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement