సాక్షి, హైదరాబాద్: కేసీఅర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. అలాగే, ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ స్థానంలోకి బీజేపీ పోదు.. బీఆర్ఎస్‌కు ప్రజలు సీఆర్‌ఎస్ (రిటైర్ మెంట్)ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. కేటీఆర్ రేవ్ పార్టీలని తిరుగుతున్నారు. అవినీతి పరులను అరెస్ట్ చేస్తే స్వాగతిస్తాం. ఆరు నెలల కింద కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12వందల కోట్లు విడుదల చేసింది. గ్రామ పంచాయతీల్లో కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి. గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.
సొమ్ము కేంద్రానిది అయితే ఇందిరమ్మ పేరు పెట్టారు. ఇందిరమ్మ కమిటీలు ఇళ్ళ లబ్దిదారులను ఎంపిక చేస్తే అడ్డుకుంటాం. ఇందిరమ్మ కమిటీలకు ఒక విధానం లేదు. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటను సుడా చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌ను కుడా చేసుకున్నారు. గ్రామ సభలు పెట్టీ ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేయాలి తప్పితే.. ఇందిరమ్మ కమిటీల ద్వారా కాదు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇళ్లను పంపిణీ చేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టే ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇందిరమ్మ కమిటీల్లో బీజేపీ భాగస్వామ్యం లేదు. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కాదు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment