ఇంజనీరింగ్‌లో సీటు రాకపోతే?  | All the ways are closing to join the degree | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌లో సీటు రాకపోతే? 

Published Wed, Jun 27 2018 1:15 AM | Last Updated on Wed, Jun 27 2018 1:15 AM

All the ways are closing to join the degree - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ వంటి కోర్సుల్లో సీట్లు రాని విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా మారనుంది. వాటిలో కన్వీనర్‌ కోటా కింద సీటు వస్తుందని చివరి క్షణం వరకు ఎదురుచూసే వేల మంది విద్యార్థులకు ఈసారి డిగ్రీ ఆప్షన్‌ లేకుండాపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిపై కళాశాల విద్యా శాఖ, డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కమిటీ (దోస్త్‌) ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈనెల 27వ తేదీతో డిగ్రీ మూడో దశ ప్రవేశాల రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న వారికి దోస్త్‌ సీట్లను కేటాయించనుంది. జూలై 5వ తేదీ నుంచి 7 వరకు కాలేజీ స్థాయిలో ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు అవకాశం కల్పించి ప్రవేశాలను ముగించాలని ఇదివరకే నిర్ణయించింది. 10వ తేదీన సీట్లు కేటాయించేలా షెడ్యూలు జారీ చేసింది. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ కోర్సుల్లో సీట్లు లభించని వారి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

తొలి దశ ప్రవేశాలే పూర్తి.. 
ప్రస్తుతం రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మొదటి దశ ప్రవేశాలు మాత్రమే పూర్తయ్యాయి. కన్వీనర్‌ కోటాలో 64,646 సీట్లు అందుబాటులో ఉండగా, 52,621 మందికి ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. అందులో 38,705 మంది మాత్రమే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారు. మరో 13,916 మంది చేయలేదు. వారంతా రెండో దశ కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వారే కాకుండా మరో 20 వేల మంది వరకు రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వారి కోసం ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ జూలై 6వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు షెడ్యూలు జారీ చేసింది. 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించి, వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించనుంది. వారందరికీ 12వ తేదీన సీట్లను కేటాయించి, కాలేజీల్లో చేరేందుకు 15వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. 

మూడో దశ ప్రకటనేదీ? 
ఈసారి ఇంజనీరింగ్‌ మూడో దశ ప్రవేశాల కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. రెండో దశ పూర్తయ్యాక మూడో దశ ప్రవేశాల ప్రకటన జారీ చేయనుంది. జూలై 25వ తేదీ వరకు ఆ ప్రక్రియను చేపట్టనుంది. మరోవైపు ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ వంటి కోర్సుల్లోనూ బైపీసీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. వాటికి ఇంకా షెడ్యూలు కూడా జారీ కాలేదు. ఈనెలాఖరు లేదా జూలైలో వాటి షెడ్యూలు ఇస్తే ఆ ప్రవేశాలు జూలై చివరి వరకు కొనసాగనున్నాయి. వేల మంది విద్యార్థులు ఆయా కౌన్సెలింగ్‌లలో పాల్గొననున్నారు.

అందులో పాల్గొనే అందరికి సీట్లు రావు. వాటిలో సీట్లు లభించని వారు చివరి ఆప్షన్‌గా ఉన్న డిగ్రీ కోర్సుల్లోనే చేరతారు. కానీ దోస్త్‌ ఈనెల 27వ తేదీ వరకే చివరి దశ ప్రవేశాల రిజిస్ట్రేషన్‌కు చర్యలు చేపట్టింది. సీట్లు రాని విద్యార్థుల పరిస్థితి ఏంటన్న అంశాన్ని ఇటు కళాశాల విద్యా శాఖ గానీ, అటు దోస్త్‌గానీ పట్టించుకోవడంలేదు. దీంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హార్టికల్చర్‌ ప్రవేశాల తర్వాత మిగిలిపోయే విద్యార్థులు డిగ్రీలో చేరే అవకాశం లేకపోతే అన్యాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరుకు మరో విడత డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement