ముగిసిన గంగ నీళ్ల జాతర | Among the special pooja decoration | Sakshi
Sakshi News home page

ముగిసిన గంగ నీళ్ల జాతర

Published Mon, Sep 29 2014 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

Among the special pooja decoration

- అశేష భక్తజనం మధ్య అడెల్లి పోచమ్మ నగల శోభాయాత్ర
- అడుగడుగునా మంగళహారతులు పట్టిన మహిళలు
- సాయంత్రం ఆలయానికి చేరిన ఆభరణాలు
- ప్రత్యేక పూజల మధ్య అలంకరణ
 సారంగాపూర్/దిలావర్‌పూర్ : భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. అశేష భక్తజనం.. అడుగడుగునా మహిళల మంగళహారతులు.. భక్తుల నృత్యాలు, ఆటపాటల మధ్య అమ్మవారి ఆభరణాల శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భక్తుల ఊరేగింపు మధ్య ఆభరణాలు శనివారం ఉదయం సారంగాపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి వివిధ గ్రామాల మీదుగా రాత్రి దిలావర్‌పూర్ మండలం సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరిన విషయం తెలిసిందే. ఆదివారం వేకువజామున గోదావరి నదీ తీరంలో స్థానిక సర్పంచు ఎం.విఠల్, ఉపసర్పంచ్ ఆనంద్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు పవిత్ర గోదావరి జలాలను ముంతల్లో తీసుకుని అమ్మవారి ఆభరణాల వెంట తరలారు. ఉదయం ఏడు గంటలకు ఆభరణాల శోభాయాత్ర అడెల్లికి తిరుగు పయనమైంది. సాంగ్వి, కదిలి, మాటేగాం, దిలావర్‌పూర్, కంజర్ గ్రామాల మీదుగా సారంగాపూర్ మండలం ప్యారమూర్, వంజర్, యాకర్‌పల్లి, సారంగాపూర్ గ్రామాల మీదుగా అడెల్లి ఆలయానికి ఆభరణాలను చేర్చారు. ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు భాజభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. దిలావర్‌పూర్‌లో భారీ పూలతోరణంతో స్వాగతం పలుకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు.

శివసత్తులు పూనకాలతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపుగా ఆభరణాలు అడెల్లి ఆలయానికి చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నగలు అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలభిషేకం, పవిత్రోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
 
కిక్కిరిసిన ఆలయ పరిసరాలు
గంగనీళ్ల జాతర నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్‌మాల్, నాందేడ్, చంద్రపూర్ జిల్లాలతోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు.  
 
భారీ బందోబస్తు
అమ్మవారి ఆభరణాలు తరలిస్తున్న దారి వెంట నిర్మల్ రూరల్ సీఐ రగు, ఎస్సైలు మల్లేశ్, అనిల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వంద మంది వాలంటీర్లుగా పనిచేశారు. అమ్మవారిని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement