చంద్రవెల్లిలోని సోమేశ్వరాలయం
బెల్లంపల్లిరూరల్ : భక్తుల కొంగు బంగారంగా నిలుస్తున్న మండలంలోని చంద్రవెల్లి సోమేశ్వరుడి ఆలయం దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 200 ఏళ్ల విశిష్ట చరిత్ర ఉన్న ఈ ఆలయం పునఃనిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. ఎంతో ప్రాధాన్యత, ఘనమైన చరిత్ర గల శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వరాలయంపై ప్రత్యేక కథనం..
రెండు వందల ఏళ్ల కిందట పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమ్మెర వంశస్థులు బతుకు దెరువు వెతుక్కుంటూ వలస బాట పట్టారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సంస్థానాధీశుని వద్దకు వెళ్లి చదువులో నిష్ణాతులైన కొమ్మెర వంశీయులు తమ ప్రతిభను ప్రదర్శించగా, సంస్థానాధీశుడు మెచ్చుకుని తమ ఆధీనంలో ఉన్న చంద్రవెల్లి గ్రామాన్ని అగ్రహారముగా రాసి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి కొమ్మెర వంశస్థులు వచ్చి స్థిరపడినట్లు ప్రతీతి. మహా శివభక్తులైన ఆ వంశీయులు నిరంతర లింగారాధన, శైవ నామస్మరణతో పూజలు చేసి ఆరాధించారు. అనంతరం గ్రామంలో ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో, మట్టి ఇటుకలు, పెంకులతో ఓ చిన్న గుడిని నిర్మించి పూజలుగా వించారు. ఉత్సవ విగ్రహాల కోసం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుంచి శివ పంచాయతనము, విఘ్నేశ్వరుడు, శివుడు, ఆంజనేయుడు, నాగేం ద్రుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడి విగ్రహాలు తెచ్చి ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈ దేవాలయం శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయంగా ప్రఖ్యాతిగాంచింది.
పునఃనిర్మాణం..
వందల ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 1987లో దేవాలయ కమిటీ, భక్తులు ఏకతాటిపైకి వచ్చి పునఃనిర్మాణానికి పూనుకున్నారు. 2008 ఫిబ్రవరి 11 వసంత పంచమి నాడు వేద మంత్రోచ్ఛరణాల మధ్య కొత్తగా నిర్మించిన ఆలయాన్ని పునః ప్రారంభించారు. ఈనెల 22న వసంత పంచమి పురస్కరించుని ఆలయ దశమ వార్షికోత్సవాన్ని వైభవంగా జరపడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
కరువు ఎరుగని గ్రామం..
గ్రామంలో వెలిసిన సోమేశ్వరుడు ఎంతో మహిమ గల దేవుడిగా భక్తుల విశ్వాసం. గ్రామం ఏర్పడిన నుంచి ఇప్పటివరకు ఎన్నడూ కరువు, కాటకాలు సంభవించలేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ గర్భగుడిలో శివలింగం మునిగేలా గ్రామస్తులు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో సోమేశ్వరుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురిపిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. 200 ఏళ్ల నుంచి పంటలు సంవృద్ధిగా పండి కరువుకు ఆస్కారం లేకుండా సోమేశ్వరుడు కాపాడుతున్నాడని విశ్వసిస్తారు.
ప్రత్యేక పూజలు..
సోమేశ్వర దేవాలయంలో ప్రతి యేటా ప్రత్యేక పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి, శ్రావణ, కార్తీక మాసాల్లో ఈ ఆలయంలో మహన్యాస, రుద్రాభిషే కం, బిల్వార్చన నిర్వహిస్తారు. వినాయక చవితి, దుర్గాదేవి వేడుకలను, గోపూజ, గ్రామ సంకీర్తన, సామూహిక సత్యనారా యణ వత్రాలు, సహఫంక్తి భోజనాలు కులమతాలకతీతంగా సామూహికంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment