
తెలుగు చిత్ర పరిశ్రమకు ఢోకా లేదు
రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన ఇబ్బందే మీ లేదని ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ అన్నారు. తన తనయుడు ఆకాశ్‌పూరి హీరోగా నటిస్తున్న ‘ఆంధ్రాపోరి’ సినిమా షూటింగ్‌ను చూసేందుకు శుక్రవారం పాల్వంచ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
⇒ రాష్ట్రాలు విడిపోయినా ఇబ్బందేమీ లేదు
⇒ హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుంది
⇒ పైరసీని అరికట్టే వ్యవస్థ రావాలి
⇒ ప్రముఖ చిత్ర దర్శకుడు పూరి జగన్నాథ్
పాల్వంచ : రాష్ట్రాలు విడిపోయినా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇబ్బందేమీ లేదని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ ఉంటుందని తెలిపారు. తన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నిర్మిస్తున్న ‘ఆంధ్రాపోరి’ షూటింగ్ చూడ్డానికి జగన్నాథ్ శుక్రవారం పాల్వంచకు వచ్చారు. ఈ సందర్భంగా బృందావన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన ‘టెంపర్’ చిత్రం అంచనాలకు మించి విజయవంతమైందని తెలిపారు. దేశ విదేశాల్లో ఈ సినిమా అత్యధిక థియోటర్లలో ఆడుతుండడం ఆనందంగా ఉందన్నారు.
మహేష్‌బాబుతో తన తదుపరి చిత్రం ఉంటుందని, జ్యోతిలక్ష్మితో మరో చిత్రం తీస్తున్నానని తెలిపారు. పైరసీల కారణంగా చిత్రపరిశ్రమ నష్టాలు చవిచూడాల్సి వస్తోందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుండగా పైరసీ కారణంగా కలెక్షన్లు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విదేశాల్లో చిత్రాలను నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోగానే పోలీసులకు సమాచారం వెళ్లిపోతుందని, పైరసీ చేసిన వారి వివరాలు తెలిసిపోతాయని అన్నారు.
అలాంటి టెక్నాలజీ ఈ దేశంలోకి రావాలని కోరుకుంటున్నానన్నారు. చక్రీ అకాల మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. దర్శకుడు రాజు మదిరాజ్ వచ్చి ఆకాశ్‌తో సినిమా చేస్తానంటూ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అనేశానని అన్నారు. భవిష్యత్తులో తన దర్శకత్వంలో ఆకాశ్ సినిమా ఉంటాయని చెప్పారు. షూటింగ్ స్పాట్లకు ఖమ్మం చాలా బాగుంటుందని, త్వరలో తన చిత్రాలను ఇక్కడే నిర్మాస్తానని అన్నారు.