అంగన్‌వాడీ కార్యకర్తలు కేంద్రంలో ఉండకుండా డుమ్మాలు కొడితే సస్పెండ్ చేస్తానని అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం హెచ్చరించారు.
అదనపు జేసీ రాజారాం
ధన్వాడ : అంగన్‌వాడీ కార్యకర్తలు కేంద్రంలో ఉండకుండా డుమ్మాలు కొడితే సస్పెండ్ చేస్తానని అదనపు జాయింట్ కలెక్టర్ రాజారాం హెచ్చరించారు. మండలకేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, పద్మశాలీభవనంలో నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ భవనాన్ని ఆయన శనివారం ఉదయం సందర్శించారు. ఆ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా విధుల్లో లేకపోవడంతో ఆయన వారితీరుపై మండిపడ్డారు. అంగన్‌వాడీ కేంద్రాలు ఎలా నిర్వహిస్తున్నారో మీరెప్పుడైన తనిఖీ చేశారా.. అని తహశీల్దార్ చందర్‌ను ప్రశ్నించారు.
అధికారులు వచ్చారనే సమాచారం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త శ్రీలక్ష్మి, ఆయా మంగమ్మ కేంద్రానికి చేరుకున్నారు. రిజిష్టర్‌లో 30మంది పిల్లలుంటే కేంద్రంలో 12మంది విద్యార్థులు మాత్రమే ఉండడమేంటీ.. ప్రతిరోజు పిల్లలకు సరిగ్గా చూసుకుంటున్నారా.. అని అడుగగా వారి సరిగా సమాధానం చెప్పకపోవడంతో మందలించారు. వెంటనే వారికి మెమో జారీ చేయాల్సిందిగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. వారంరోజులపాటు ఈ కేంద్రం పనితీరుపై నిఘా ఉంచాలని తహశీల్దార్‌ను కోరారు. ఏజేసీ వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు.