
అంజలి నైపుణ్యం అద్భుతం
పదమూడేళ్ల వయస్సు.. కానీ అప్పుడే పెద్దపెద్ద బహుమతులు.
చిన్న వ యసులోనే బ్లాక్‌బెల్ట్
జాతీయ స్థాయిలో వెండి పతకం
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : పదమూడేళ్ల వయస్సు.. కానీ అప్పుడే పెద్దపెద్ద బహుమతులు. ఓ వైపు చదువులో రాణిస్తూనే.. మరోవైపు కరాటేలే తన అద్భుత ప్రతిభా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది బండారి అంజలి. నేపాల్‌కు చెందిన వీరి కుటుంబం పదిహేనేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అంజలి తండ్రి రమేష్‌చంద్ర వృత్తిరీత్యా గూర్ఖా.
ఐదో తరగతి నుంచే అంజలి కరాటేలో శిక్షణ పొందుతోంది. స్పారింగ్‌తోపాటు కటాస్‌లో సైతం రాణిస్తోంది. మూడున్నరేళ్లలోనే బ్లాక్‌బెల్ట్ సాధించి తన ప్రతిభ ఏంటో చాటింది. అతి చిన్నవయసులో బ్లాక్‌బెల్ట్ సాధించిన ఘనత జిల్లాలో అంజలికే దక్కిందని, ఇంతటి కఠోరమైన సాధన ఆడపిల్లలకు సాధ్యం కాదని పలువురు కరాటే శిక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి నెలలో కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అంజలి ద్వితీయస్థానం సాధించి వెండి పతకాన్ని సాధించింది. ఇప్పటివరకు జిల్లాస్థాయి పోటీల్లో రెండు సార్లు ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాలు అందుకుంది. మరోసారి ద్వితీయ స్థానం పొంది వెండి పతకాన్ని దక్కించుకుంది. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంతో వెండి పథకాన్ని అందుకుంది.