పునరుత్పాదక విద్యుత్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలో మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
- టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: పునరుత్పాదక విద్యుత్ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలో మరో 2000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన, వాటి నుంచి కొనుగోళ్ల కోసం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) త్వరలో టెండర్లు ఆహ్వానించనుంది. ఇప్పటికే 500 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఎస్పీడీసీఎల్ ముగించింది.
రెండో విడతలో భాగంగా మరో 2000 మెగావాట్ల కొనుగోళ్లకు టెండర్లు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అనుమతించింది. తొలివిడతగా 500 మెగావాట్ల కోసం పిలిచిన టెండర్లలో 108 కంపెనీల నుంచి 138 బిడ్లు దాఖలయ్యాయి. రూ.6.45 నుంచి రూ.6.90 వరకు ధరలు సూచించిన 34 కంపెనీల నుంచి 505 మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం ఎస్పీడీసీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. తొలివిడత టెండర్లలోని కనిష్ట ధర(రూ.6.45)నే భవిష్యత్తులో సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం డిస్కవర్ ప్రైస్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇకపై సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం ఈ ధరనే గరిష్ట పరిమితిగా సూచిస్తూ రివర్స్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను పిలవనుంది. ఔత్సాహి క ప్రైవేటు కంపెనీలు ఈ ధరకు సమానంగా, అంతకంటే తక్కువకు విద్యుత్‌ను విక్రయిం చేందుకు సమ్మతిస్తూ టెండర్లు దాఖలు చేయా ల్సి ఉంది. 2000 మెగావాట్ల కొనుగోళ్లకు తొలి సారిగా రివర్స్ బిడ్డింగ్‌లో టెండర్లను ఆహ్వానించేందుకు ఎస్పీడీసీఎల్ కసరత్తు చేస్తోంది.