
మరో 45 రోజులపాటు ఇదే పని
- వానలు పడేదాకా చెట్లు, గుట్టల వెంట తిరుగుతా..
- నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
జోగిపేట: ‘నేను చెరువుల దీక్ష చేపట్టిన.. ఇంకా 45 రోజుల దాకా ఇదే పనిమీద ఉంట... తెలంగాణ రైతులందరికి నీళ్లందే దాకా నీరడిగా పనిచేస్త’ అని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా అందోల్ మండలం రాంసానిపల్లి, టేక్మాల్ మండలం కాద్లూర్‌లో మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వానలు పడేదాకా చెట్లు, గుట్టల వెంటే తిరుగుతానని చెప్పారు. నిన్న చిన్నశంకరంపేట, చేగుంటలో.. నేడు అందోల్‌లో పూడికతీత పనుల్లో పాల్గొన్నట్టు తెలిపారు. రేపు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. అధికారులు కూడా టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకొని మధ్యాహ్నం చెరువు గట్ల వద్దే తినాలని.. అలాగే పనుల నాణ్యతను పర్యవేక్షించాలన్నారు.
పనిచేయని వారిపై చర్యలు..
చెరువు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనిచేయకపోయినా, ఆ వ్యక్తులకు అధికారులు సహకరించినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఒక్కో అధికారి ఒక్కో చెరువును దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
చెరువుల మరమ్మతుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతుల కడుపులు కొట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిందని హరీశ్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు రైతుల క డుపుకొడితే..కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారని ఆరోపిం చారు. సీఎం కేసీఆర్ చెరువుల మరమ్మతుల కోసం రూ.2 వే ల కోట్లు కేటాయించారన్నారు. పనులను పారదర్శకతకు ఈ-టెండర్లను నిర్వహించినట్టు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో మిషన్ కాకతీయను విజయవంతంగా ముందుకు తీ సుకెళ్తామన్నారు. బంగారు తెలంగాణకోసం మన భూముల్లో బంగారం పండించాలని మంత్రి సూచించారు.