కరోనా కేసులు.. మరణాల సంఖ్యలతో పత్రికలు నిండిపోతున్న నేపథ్యంలో ఎట్టకేలకు కొన్ని శుభవార్తలూ వినిపించడం మొదలైంది. ఒకవైపు కోవిడ్–19 నివారణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన టీకా మానవ ప్రయోగాలకు సిద్ధమవుతుంటే.. ప్రపంచం నలుమూలల్లో కనీసం మూడు నాలుగు కొత్త వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలు చూపుతున్నాయి. కోవిడ్–19ను జయించగలమన్న ధీమాను కల్పిస్తున్నాయి. అంతర్జాతీయ ఫార్మా కంపెనీ ఫైజర్, చైనాలోని కాన్‌సైనో, ఆస్ట్రేలియాలోని వ్యాక్సైన్‌లు కీలకమైన దశలు దాటుకుని వేగంగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చే దిశగా సాగుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్ : ఫైజర్ కంపెనీ బీఎన్‌టీ162బీ1 పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా ప్రయోగాల ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. కోవిడ్ బారినపడి కోలుకున్న వారి రక్తంతో పోల్చినప్పుడు ఈ కొత్త టీకా వాడిన వారిలో ఎక్కువ మోతాదులో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏను మానవ శరీర కణాల్లోకి జొప్పించడం ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీల ఉత్పత్తి జరిగేలా చూడటం ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత. ఇది ఎలాంటి దుష్ప్రభావాలు చూపడటం లేదని, రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తోందని స్పష్టమైంది. ఫైజర్ 18 – 55 మధ్య వయస్కులు 45 మందికి ఈ కొత్త టీకాను అందించింది. వీరిలో అత్యధికులకు మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు, మిగిలిన వారికి ఉత్తుత్తి టీకా ఇచ్చారు. రెండవ డోసు తీసుకున్న వారిలో చాలామందికి జ్వరం మాత్రం వచ్చిందని ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఒకదాంట్లో ప్రచురితమైన వివరాలు తెలుపుతున్నాయి. అయితే ఇది ఊహించిందేనని నిపుణులు అంటున్నారు. ఇదే సమయంలో అమెరికన్ కంపెనీ మోడెర్నా, బ్రిటిష్–స్వీడన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకాలు ఇప్పటికే మూడవ దశ మానవ ప్రయోగాలకు సిద్ధమవుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. (5 రోజుల్లోనే మరో లక్ష)
వ్యాక్సిన్ అవసరమే ఉండకపోవచ్చు: ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్త
ప్రాణాంతక మహమ్మారి కరోనా నిరోధానికి టీకా అభివృద్ధి చేసేందుకు ప్రపంచం మొత్తమ్మీద పలు ప్రయత్నాలు జరుగుతుండగా దీని అవసరమే ఉండకపోవచ్చునని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్త సునేత్ర గుప్త అంటున్నారు. కొంతకాలం తరువాత జలుబు మాదిరిగానే కోవిడ్–19 కారక కరోనా కూడా సాధారణ జీవితంలో భాగమైపోతుందని ఆమె ఒక దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఆరోగ్యంగా ఉన్న సాధారణ ప్రజలు కరోనా వైరస్ గురించి పెద్దగా బెంగపడాల్సిన అవసరం లేదని, వయసు ఎక్కువగా ఉన్నవారు, గుండెజబ్బు వంటి ఇతర జబ్బులు ఉన్న వారు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని కాపాడుకునేందుకు టీకా అవసరం కావచ్చుగానీ.. మిగిలిన వారికి టీకాతో పని ఉండకపోవచ్చునని చెప్పారు. కరోనా వైరస్ ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టి కొంతకాలం తరువాత జలుబు మాదిరిగా అప్పుడప్పుడూ పలుకరించేదిగా మారతుందన్నది తన అంచనా అని తెలిపారు. లాక్‌డౌన్ వంటి చర్యలు వైరస్‌ను కట్టడి చేసేందుకు తాత్కాలికంగా ఉపయోగపడవచ్చుగానీ.. దీర్ఘకాలంలో మాత్రం కాదని స్పష్టం చేశారు.
మిలటరీ వాడకానికి ఓకే...
చైనీస్ కంపెనీ... కాన్‌సైనో బయలాజిక్స్ బీజింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా నిరోధక టీకా కూడా విస్తృత ప్రయోగాల దిశగా సాగుతోంది. చైనాలో మొత్తం ఎనిమిది టీకా ప్రయోగాలు జరుగుతుండగా కాన్‌సైనో ‘ఏడీ5’పేరుతో సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపినట్లు తెలుస్తోంది. రెండో దశ ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉండగా.. చైనా ప్రభుత్వం ఏడాదిపాటు దీన్ని మిలటరీ వర్గాల వారికి అందించేందుకు ఓకే చెప్పడం విశేషం. తొలిదశ ప్రయోగాల్లో భాగంగా ఏడీ5ను ఆరోగ్యంగా ఉన్న 108 మందికి అందించారు. మూడు మోతాదుల్లో ఒకే డోసు టీకా ఇవ్వడం గమనార్హం. ఆపై 28 రోజుల తరువాత వీరిలో యాంటీబాడీలు నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అత్యధిక మోతాదులో టీకా అందుకున్న వారిలో మూడొంతుల మందిలో యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి కాగా, తక్కువ, మధ్యమస్థాయిలో టీకా అందుకున్న వారిలో సగం మందిలో మంచి ఫలితాలు కనిపించాయి.
రోగ నిరోధక వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన టీ–సెల్స్‌ను ప్రేరేపించడంలోనూ ఈ టీకా విజయం సాధించినట్లు సమాచారం. జలుబును కలగజేసే అడినవైరస్‌ను బలహీనపరచి కరోనా వైరస్ తాలూకూ కొమ్ములను ఉత్పత్తి చేసే జన్యుపదార్థాన్ని జొప్పించడం ఈ టీకా ప్రత్యేకత. ఈ కొమ్ములను గుర్తించే రోగ నిరోధక వ్యవస్థ చైతన్యవంతమై యాంటీబాడీలను ఉత్పత్తి చేసి వైరస్‌పై దాడి చేస్తుందన్నమాట. చైనాకు చెందిన మరో కంపెనీ బయోఎన్‌టెక్ కరోనా వైరస్ నిరోధానికి అభివృద్ధి చేసిన రెండు టీకాల మూడో దశ మానవ ప్రయోగాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్నాయి. సైనోవాక్ బ్రెజిల్‌లో మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment