నచ్చినా నచ్చకున్నా.. కలసి మెలసి ఉండాలి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాష్ట్రపతి ఉద్బోధ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి మెలసి ఉండాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. రెండు రాష్ట్రాలు సామరస్య వాతావరణంలో పనిచేయాలని, దేశభ్యున్నతికి పాటుపడాలని ఆకాంక్షించారు. ఒక రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు రాసిన ‘ఉనికి’ పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కె. చంద్రశేఖర్‌రావు తొలి ప్రతిని ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతికి అందించారు.
ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర మంత్రి బండారుదత్తాత్రేయ, తెలంగాణ సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రణబ్ తన ప్రసంగంలో రెండు రాష్ట్రాలు విభేదాలకు తావివ్వకూడదనే సందేశమిచ్చారు. ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించటం సరికాదంటూ విభజన అంశాన్ని సుదీర్ఘకాలంగా తెలిసిన వ్యక్తిగా తాను ఒక సలహా ఇవ్వాలనుకున్నట్లు చెప్పారు. ‘ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్ కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు.
తొలి సైబర్‌సిటీ కాన్సెప్ట్, హైటెక్ సిటీ ఏర్పాటుతోపాటు ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడే ప్రారంభమైంది. ఇదొక ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది. కేవలం తెలంగాణ, ఏపీ ప్రజలకే కాకుండా మొత్తం దేశానికి హైదరాబాద్ వల్ల లబ్ధి చేకూరుతుంది. అందుకే ఈ సిటీకి జాతీయ ప్రాముఖ్యత ఉంది..’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ‘దేశ విదేశీ వ్యవహారాల్లో స్నేహితులను ఎంచుకోవటం మన చేతుల్లో ఉంటుంది.. కానీ ఇరుగు పొరుగు వారిని ఎంచుకోలేము. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇరుగుపొరుగువారు మనతోనే ఉంటారు. వారితో శాంతియుతంగా ఉండాలా, ఘర్షణాత్మక వైఖరి కొనసాగించాలా అనేది మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ, ఏపీలతోపాటు అన్ని సరిహద్దు రాష్ట్రాలు సామరస్యంతో మెలగాలి. ఎందుకంటే మనందరం భారత్‌లో ఉన్నాం. సామరస్యపూర్వకంగా పనిచేస్తే సమగ్రాభివృద్ధి వైపు పయనిస్తాం..’ అన్నారు. ప్రధాని ఆవిష్కరించిన క్లీన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా.. పథకాలన్నీ దేశ పురోగతికి దోహదపడతాయన్నారు.
విద్యాసాగర్‌రావు ముందే తెలుసు
‘ఉనికి’ పుస్తకం మొదటి ప్రతిని అందుకోవటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు. విద్యాసాగర్‌రావు పార్లమెంట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి వాజ్‌పేయ్ మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా, వాణిజ్యశాఖ మంత్రిగా పని చేసినప్పటి నుంచి తనకు తెలుసునన్నారు. పుస్తక రచయిత, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ గతంలో వివిధ పత్రికలకు తాను రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం తెచ్చినట్లు చెప్పారు. తన పుస్తకావిష్కరణకు రాష్ట్రపతి రావటంతో ‘ఉనికి’కే ఉనికి ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏ సమాజమైనా ఉనికి కోసం తపిస్తుందని, 6 దశాబ్దాలుగా తెలంగాణ సమాజం కూడా ఉనికి కోసం జరిపిన పోరాటంలో విజయం సాధించిందన్నారు. విద్యాసాగర్‌రావు నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించేందుకు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ జీవితంలో పది మందికి ఉపయోగపడితేనే మన ఉనికిని సమాజం కీర్తిస్తుందన్నారు. తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరముందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొనగా బలహీనపడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉనికి పుస్తకం కొత్త శక్తినిస్తుందని జానారెడ్డి పేర్కొన్నారు.
ప్రణబ్‌ను తెలంగాణ మర్చిపోదు: సీఎం కేసీఆర్
తెలంగాణ చరిత్రలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి చిరస్మరణీయ స్థానం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గత 30 ఏళ్ల రాజకీయ అనుభవాలకు ప్రణబ్ నిలువెత్తు నిదర్శనమని.. ఎప్పుడంటే అప్పుడు చరిత్రను కంప్యూటర్‌లా చెప్పగలిగే విజ్ఞానమున్న మేధావి అని కితాబిచ్చారు. ప్రణబ్ అంటే తనకు అపార గౌరవం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు పాసయ్యాక గౌరవపూర్వకంగా ఆయన్ను కలసి ఆశీస్సులు తీసుకునేందుకు వెళ్లగా.. ‘ఎన్నిసార్లు కలిసినా, ఎప్పుడు అడిగినా తెలంగాణ కావాలనేది నీ ఏకైక కోరిక. బతికున్నప్పుడే రాష్ట్రాన్ని సాధించిన ధన్యజీవివి..’ అంటూ ప్రణబ్ వ్యాఖ్యానించారన్నారు. చాలా సందర్భాల్లో తనను ‘కొంత ఆవేశం తగ్గించుకో.. కొంచెం ఓపికపట్టు.. తొందరపాటు వద్దు.. అని బుజ్జగించే వారు..’ అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ బిల్లుపై ప్రణబ్ సంతకం చేయటం తమ అదృష్టమన్నారు.