శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గలాటా, జాతీయగీతానికి అవమానం జరగడంపై బాధ్యులతో క్షమాపణ చెప్పించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం అభిప్రాయపడినట్లు సమాచారం.
హైదరాబాద్: శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన గలాటా, జాతీయగీతానికి అవమానం జరగడంపై బాధ్యులతో క్షమాపణ చెప్పించాలని శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశం అభిప్రాయపడినట్లు సమాచారం. శనివారం శాసనసభలో గవర్నర్ ప్రసంగం సమయంలో, జాతీయ గీతాలాపన సమయంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు టేబుళ్లు ఎక్కి, నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను బీఏసీ సమావేశంలో ఫ్లోర్‌లీడర్లకు చూపించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయమే స్పీకర్‌తో మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, డి.శ్రీనివాస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, డాక్టర్ లక్ష్మణ్, సున్నం రాజయ్య, రవీంద్రకుమార్ భేటీ అయ్యారు.
ఘటనకు బాధ్యులైన సభ్యులపై చర్య తీసుకోవాలని ఎంఐఎం అంతకు ముందే స్పీకర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ సమావేశానికి హాజరుకాలేదు. ఈ సందర్భంగా శని వారం నాటి సభలోని వీడియో దృశ్యాలను ఫ్లోర్‌లీడర్లకు చూపారు. అవి చూసిన నేతలంతా బాధ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే ఆ రోజు మొత్తం రికార్డయిన దృశ్యాలను చూపాలని, ఎడిట్ చేసి చూపిస్తే ఎలాగని టీడీపీ అభ్యం తరం తెలిపిన ట్లు సమాచారం. ముందు జాతీయ గీతాన్ని అవమానించిన విషయాన్ని తేల్చాక.. మిగతా దృశ్యాలు కూడా చూపెడతామని మంత్రి హరీశ్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా క్షమాపణ చెప్పాలన్న నిర్ణయం జరిగిందని అధికారపక్షం పేర్కొన గా.. తాము అంగీకరించలేదని టీడీపీ, మరోసారి అన్ని దృశ్యాలు చూపాలని ఇతర నేతలు కోరినట్లు సమాచారం. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి, గాంధీ, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ టేబుళ్లు ఎక్కినట్లు నిర్ధారించారని.. వారు క్షమాపణ చెబితే చాలని బీఏసీ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
సీట్ల కేటాయింపు.. గందరగోళం
శాసనసభలో ఎట్టకేలకు సభ్యులకు సీట్ల కేటాయింపు జరిగింది. గత సంప్రదాయాలకు అనుగుణంగానే అధికారపక్ష సభ్యులకు స్పీకర్ స్థానానికి కుడివైపున, విపక్ష సభ్యులకు ఎడమవైపున సీట్లను కేటాయించారు. అధికారపక్షం వైపు ముందు సీట్లన్నీ మంత్రులకు, విపక్షం వైపు ముందుసీట్లను ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఇచ్చారు. సీపీఐ, సీపీఎంలకు మాత్రం ముందు వరుసలో సీట్లు లభించలేదు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన తాటి వెంకటేశ్వర్లు పార్టీ ఫ్లోర్‌లీడర్‌గానే కొనసాగుతుండటంతో ఆయనకు కూడా ముందు వరుసలోనే సీటు కేటాయించారు.
ఇక ఈ సారి తొలిసారిగా సభ్యులకు సీట్లు కేటాయించి, పేర్లను అతికించడంతో... సభలోకి వచ్చిన సభ్యులంతా తమ సీట్లను వెతుక్కుంటూ కనిపించారు. ఇక పార్టీల వారీగా సీట్ల కేటాయింపు ఉండటంతో పార్టీలు మారిన ఎమ్మెల్యేలు ఎక్కడ కూర్చోవాలో తెలియక గందరగోళంలో పడి.. మంత్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పార్టీ మారిన టీడీపీ సభ్యులు చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కనకయ్య తదితరులు సభ ప్రారంభానికి ముందు వరకూ వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోగా... సభ ఆరంభమయ్యాక మాత్రం వీరితో పాటు మిగతా ఎమ్మెల్యేలు ఖాళీగా ఉన్న కుర్చీల్లో వెనుక వరుసలో కూర్చున్నారు.
గంట ఆలస్యంగా సభ
సభావ్యవహారాల కమిటీ (బీఏసీ)లో నిర్ణయించిన మేరకు సోమవారం ఉదయం 10 గం టలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ స్పీకర్‌తో ఫ్లోర్‌లీడర్ల భేటీ 11 గంటలదాకా కొనసాగడంతో.. సభ గంట ఆలస్యంగా మొదలైంది. రాష్ట్ర శాసనసభ చరిత్ర (ఉమ్మడి రాష్ట్రం సహా)లో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఇది బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ఉందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. స్పీకర్ వద్ద సమావేశం ముఖ్యమైనదని భావించినట్లయితే, ముందు బీఏసీ రూల్స్ మేరకు సభను ప్రారంభించి, వాయిదా వేస్తే సరిపోయేదని వారు పేర్కొన్నారు. అలాగాకుండా శాసనసభను ప్రారంభించే సమయం అవుతున్నా.. భేటీ కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.