నియామకాల వృద్ధిలో హైదరాబాద్ టాప్
న్యూఢిల్లీ: ఆన్లైన్ నియామకాల వృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలలో ఇక్కడ నియామకాల వృద్ధి 24 శాతంగా నమోదయ్యింది. దీని తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై ఉన్నాయి. ఇక గతేడాది నవంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నియామకాల వృద్ధి 9 శాతంగా నమోదయ్యింది.
ఐటీ, బ్యాంకింగ్ రంగాలతో సహా ఇతర రంగాల్లో కూడా నియామకాల జోరు కొనసాగిందని నౌకరీడాట్‌కామ్ పేర్కొంది. ఇక అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 25 శాతం పెరిగాయని నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే.. టెలికం రంగంలో నియామకాల వృద్ధి అత్యధికంగా 61 శాతంగా నమోదయ్యింది.