రైతులను మోసం చేస్తున్న కేసీఆర్
డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్
నిజామాబాద్ క్రైం : రుణమాఫీ విషయంలో రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. బ్యాంకులో రుణాలను 25 శాతం చెల్లిస్తే తిరిగి రీషెడ్యూల్ ఎలా చేస్తారని ప్రశ్నిం చారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ వారి ఓట్లతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు.
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం 25 శాతం రుణాలు చెల్లించేందుకు రూ.4,250 కోట్లు బ్యాంకులకు చెల్లించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ రైతులు తీసుకున్న మొత్తం రుణం సెప్టెంబర్ 30 వరకు చెల్లిస్తేనే బ్యాంకులు తిరిగి రుణాలు ఇచ్చేందుకు రీ షెడ్యూల్ చేసేందుకు ముందుకువస్తాయన్నారు. అలా కాకుండా మొత్తం రుణంలో 25 శాతం రుణం మాత్రం చెల్లిస్తే ఏ బ్యాంకులు కూడా దీనిని ఒప్పుకోవన్నారు. మిగతా 75 శాతం రుణంపై బ్యాంకులు వడ్డీ విధిస్తాయన్నారు. రుణమాఫీ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ రిజర్వు బ్యాంక్ అధికారులతో మాట్లాడితే రైతుల రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.
రుణ మాఫీ లేకుండా పోవడం, రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు అవకాశం కోల్పోతుండటంతో రైతు కుటుంబాలు పండుగలు ఎలా చేసుకుంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి దసరా పండుగకు దూరంగా ఉండే పరిస్థితులు దాపురించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనీసం పండుగల పూట అయినా విద్యుత్ కోత లేకుండా ఇచ్చామన్నారు. ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం పండుగల పూట కూడా విద్యుత్ కోతలు విధిస్తోందని తీవ్రంగా మండిపడ్డారు.