సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంజనీరింగ్ కోర్సులు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రస్థాయి విద్యాసంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రధానం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏఐతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి.
ఐఐటీ హైదరాబాద్ బాటలో..
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే మొదటిసారిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు సైతం అదే బాట పట్టనున్నాయి. ఏఐతోపాటు మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ చర్యలు చేపట్టింది. ఈ కోర్సును 2019–20 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లవారీగా సిలబస్‌ను రూపొందించింది. వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదిస్తే కోర్సును అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రస్థాయి కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ కానుంది.
ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు 2.5 శాతమే..
ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నది కేవలం 20 శాతంలోపేనని నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వైర్లెస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ నైపుణ్యాలుగల వారికి మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ డిమాండ్ ఉండగా కేవలం 2.5 శాతం మాత్రమే ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.
మరోవైపు దేశంలోనూ ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కాస్త మెరుగై 37 శాతానికి చేరుకున్నా తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే 63 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే 2019–20 విద్యాసంవత్సరం నుంచి 600–700 గంటలు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి.
ఏఐ, బిగ్ డేటాకు భారీ డిమాండ్...
ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు... రానున్న రోజుల్లో అంచనాలకు మించి విస్తరించనుందని జర్మనీకి చెందిన స్టాటిస్టా అనే గణాంక సేకరణ ఆన్‌లైన్ సంస్థ అంచనా వేసింది. 2016లో 3.2 బలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ మార్కెట్ రెవెన్యూ... 2025 నాటికి 89.85 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, శామ్‌సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఏఐ, ఏఐ సంబంధిత రంగాల్లో పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్‌లో 2011లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా మార్కెట్ ప్రస్తుతం 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్టాటిస్టా అంచనా వేసింది. అది 2027 నాటికి వంద శాతం వృద్ధితో 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment