
సాక్షి, హైదరాబాద్ : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నూతన టెక్నాలజీలు సాంకేతిక విద్యలో దూసుకువస్తున్న నేపథ్యంలో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో 2019-2020 విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేథ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ)లో బీటెక్ ప్రోగ్రామ్‌ను ఐఐటీ హైదరాబాద్ ప్రారంభించనుంది. ఏఐలో పూర్తిస్ధాయి బీటెక్ ప్రోగ్రాంను ఆఫర్ చేస్తున్న తొలి భారత విద్యా సంస్థ ఐఐటీ- హైదరాబాద్ కావడం గమనార్హం. ఇక అమెరికాకు చెందిన కర్నెగీ మెలన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) తర్వాత ఈ తరహా కోర్సును అందిస్తున్న మూడవ విద్యా సంస్థగా కూడా ఐఐటీ హైదరాబాద్ నిలవనుంది.
ఇక బీటెక్ ఏఐలో 20 మంది విద్యార్ధులను తీసుకుంటారు. ఈ కోర్సులో భాగంగా విద్యార్ధులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో మూల సిద్ధాంతం, ప్రాథమిక అంశాలు, ప్రాక్టికల్స్‌పై అత్యున్నత శిక్షణ అందిస్తారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ల్లో పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా విద్యార్ధులను దేశీయ, అంతర్జాతీయ పరిశ్రమల్లో రాటుదేలేలా తీర్చిదిద్దుతారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఏఐ శిక్షణ, పరిశోధనకు అనువైన వాతావరణం ఏర్పాటు చేయడమే ముఖ్యోద్దేశంగా ఈ కోర్సును ప్రవేశపెడుతున్నామని, ఏఐలో బీటెక్, ఎంటెక్ సహా పలు ప్రోగ్రామ్‌లను అందుబాటులో ఉంటాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ యూబీ దేశాయ్ వెల్లడించారు. విద్యాపరమైన అంశాలతో పాటు పరిశోధన, అభివృద్ధికీ మెరుగైన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment