
అందని ‘ఆసరా’
పెన్షన్ల కోసం పండుటాకులు, వితంతువులు, వికలాంగులు పడని బాధలు పడుతున్నారు.
⇒ అండ కోల్పోవడంతో తీవ్ర ఆందోళన
⇒ మనస్తాపంతో పండుటాకుల్లా రాలిపోతున్న వృద్ధులు
⇒ వికలాంగుల అవస్థలు
⇒ ఓ మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి నెట్‌వర్క్: పెన్షన్ల కోసం పండుటాకులు, వితంతువులు, వికలాంగులు పడని బాధలు పడుతున్నారు. ‘ఆసరా’ పథకం కింద పెన్షన్ దక్కని వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఆదుకున్న పింఛన్ సొమ్ము ఇకపై రాదన్న బెంగతో వృద్ధులు మంచంపట్టి మృత్యుఒడికి చేరుకుంటున్నారు. ఆర్థిక అండ లేకుండా ఎలా బతకాలో తెలియక వితంతువులు, వికలాం గులు నిర్వేదంలో మునిగిపోతున్నారు. పింఛన్ల జాబితా తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
దిక్కులేక ఆత్మహత్యాయత్నం
పింఛన్ జాబితాలో పేరులేదని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ మహిళ పురుగుమందు తాగేందుకు యత్నించింది. గురువారం ఇక్కడ నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారుల జాబితాలో గ్రామానికి చెందిన అత్తెల్లి అమృత పేరు లేకపోవడంతో ఆమె ఆవేదనకుగురైంది. తన వెంట తెచ్చుకున్న పురుగుమందును తాగేందుకు ప్రయత్నించింది. దీంతో స్థానికులతోపాటు ఎమ్మెల్యే ఆమెకు సర్దిచెప్పారు.
కొన్నేళ్ల క్రితం తనను భర్త వదిలేశాడని, గతంలో పింఛన్ వచ్చిందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఏ ఆధారం లేని తనకు ఇప్పుడు పింఛన్ తీసేయడం ఎంతవరకు న్యాయమని బోరున విలపించింది. దీంతో ఎమ్మెల్యే కల్పించుకుని.. వచ్చే నెలలో పింఛన్ అందుతుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని చూడాలని అక్కడే ఉన్న ఎంపీడీవోకు సూచించారు.
పింఛన్ రాదన్న ఆవేదనతో..
పింఛన్ రాలేదన్న మనస్తాపంతో ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాణిక్యారంలో ఓ వృద్ధుడు మంచం పట్టి మృతిచెందాడు. గ్రామానికి చెందిన బానోతు బాలుకు పింఛన్ రద్దుకావడంతో మనస్తాపం చెందికొద్దిరోజులుగా మంచంపట్టాడు. ఇటీవలి తుది జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురై బుధవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై ఎంపీడీవో అల్బర్ట్‌ను వివరణ కోరగా నిబంధనల ప్రకారమే సర్వే విచారణ జరిగిందన్నారు. ఓటర్, రేషన్ కార్డుల్లో వయసు తక్కువగా పడిందన్నారు. అయినా 65 సంవత్సరాలుగా నమోదు చేసి పెండింగ్ జాబితాలో చేర్చామన్నారు.
సొమ్మసిల్లిన యువతి
కాగజ్‌నగర్ నాలుగో వార్డులో ఉండే మూగ యువతి సంధ్యకు కాళ్లూచేతులు కూడా పనిచేయడం లేదు. తనకు పెన్షన్ అందించాలని కోరుతూ తల్లిదండ్రుల సహాయంతో గురువారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చింది. కార్యాలయం లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. కన్నబిడ్డ బాధలు చూసి తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. తమకు ఏ ఆధారం లేదని, గతంలో నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే కాలం వెళ్లదీశామని, జాబితాలో తమ బిడ్డ పేరు లేకపోవడంతో రెండు నెలల నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని సంధ్య తండ్రి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తక్షణమే పింఛన్ అందేలా ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
‘ఆసరా’ కోసం ఆందోళన
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయం ఎదుట వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ధర్నా చేపట్టారు. సుమారు నాలు గు గంటలపాటు అక్కడే బైఠాయించారు. గతం లో తమకు వచ్చిన రూ. 200 ఆసరాను కూడా ఇప్పుడు లేకుండా చేశారని శాపనార్థాలు పెట్టా రు. తమకు అర్హత లేదంటూ అన్యాయం చేయడం తగదని మండిపడ్డారు. పింఛన్ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. చివరకు అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.