సీట్ల పెంపు లేదు! | assembly seats not to be increase says kcr | Sakshi
Sakshi News home page

2026లోనే అసెంబ్లీ సీట్ల పెంపు!

Published Fri, Jul 28 2017 8:11 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సీట్ల పెంపు లేదు! - Sakshi

సీట్ల పెంపు లేదు!

2026లోనే అసెంబ్లీ సీట్ల పెంపు.. భేటీలో ప్రధాని ఈ విషయాన్నే స్పష్టం చేశారు: కేసీఆర్‌


ఇప్పుడు ప్రక్రియ మొదలుపెట్టినా ఐదేళ్లు పడుతుందన్నారు
తెలంగాణ, ఏపీలకు త్వరలో కొత్త గవర్నర్లు!
‘ఓటుకు కోట్లు’ కేసు ఇంకా ముగిసిపోలేదు
ఏపీతో వివాదాలు రావొద్దనే కోరుకుంటున్నాం
వచ్చే ఎన్నికల్లో బీజేపీ హవా పెద్దగా ఉండకపోవచ్చు


సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీల్లో 2026 సంవత్సరానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశం లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. 2026లో ఎలాగూ పెరుగుతాయి కదా అని బుధవారం నాటి భేటీలో ప్రధాని మోదీ పేర్కొన్నారని.. దీనిని బట్టి సీట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలిపారు. గురువారం ఢిల్లీలోని తుగ్లక్‌రోడ్‌లో ఉన్న తన నివాసంలో కేసీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీని కోరాను. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. ఒకవేళ నియోజకవర్గాల పెంపుపై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినా అది ఐదేళ్ల సమయం తీసుకుంటుందని.. అప్పటికి 2026 డెడ్‌లైన్‌ దగ్గరికి వచ్చేస్తుందని చెప్పారు. కానీ నియోజకవర్గాల పునర్విభజనపై ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తే.. మూడు నాలుగు నెలల్లోనే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయినా దీనిపై కేంద్రం ఎందుకు దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు..’’అని పేర్కొన్నారు.

అయినా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సహా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి చేస్తామని తెలిపారు. ఇక తెలంగాణ, ఏపీలకు త్వరలో కొత్త గవర్నర్లు వస్తారని తాను కూడా విన్నానని, కానీ కచ్చితమైన సమాచారమేదీ లేదని కేసీఆర్‌ వెల్లడించారు. తెలంగాణకు గవర్నర్‌గా రాజ్యసభలో బీజేపీపక్ష నేత శంకరమూర్తి, ఏపీకి గవర్నర్‌గా గుజరాత్‌ మాజీ సీఎం ఆనందీబెన్‌ పేర్లు వినిపిస్తున్నాయని చెప్పారు.

‘ఓటుకు కోట్లు’ను వదలబోం..
టీడీపీ ‘ఓటుకు కోట్లు’కుంభకోణాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ఆ కేసు ముగిసిన అధ్యాయమేమీ కాదని, దర్యాప్తు జరుగుతోందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘మా ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి, రాష్ట్రపతి పాలన వచ్చేలా చేయడానికి పొరుగు రాష్ట్రం పన్నిన కుట్ర అది. అందుకే దాన్ని మేం సీరియస్‌గా తీసుకున్నాం. అసలు రాష్ట్రం ఏర్పాడ్డాక చంద్రబాబుకు హైదరాబాద్‌లో పనేంటి? నేనైతే పది రోజుల్లోనే విజయవాడకు మకాం మార్చేవాడిని..’’అని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కుంభకోణం తర్వాత తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఫిరాయింపులు అనైతికమని ఆ సమయంలో చాలా మంది అన్నారని... కానీ తెలంగాణ సుస్థిరంగా ఉండి తన కాళ్లపై తాను నిలబడటం కోసం ఏకీకృతం కావడం నైతికం, న్యాయం కూడా అని చెప్పారు.

బీజేపీ విస్తరణ అంత సులువుకాదు..
2019లో వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఇప్పుడున్నంత సంఖ్యాబలం రాకపోవచ్చని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అప్పటికి ఆ పార్టీ ముందు అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని చెప్పారు. ఏ ఒక్క వర్గాన్ని ఆకట్టుకునే పథకాలేవీ ఇంతవరకు తేలేదని, ఈ విషయాన్ని నేరుగా మోదీకే చెప్పానని తెలిపారు. దక్షిణ భారతదేశానికి విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని.. కానీ అదంత సులువుకాదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడం చాలా కష్టమని.. కర్ణాటకలోనూ అంత సులువేమీ కాదని చెప్పారు. అయితే ముస్లిం జనాభా ఎక్కువగా లేని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కన్నా తెలంగాణపైనే బీజేపీ ఎక్కువగా దృష్టి పెడుతోందన్నారు. ఇక తెలంగాణకు కేంద్రం సాయంపై అమిత్‌షా లెక్కలను తానెందుకు విమర్శించానో మోదీకి వివరించానని చెప్పారు.

వెంకయ్యనాయుడు వెళ్లడం నష్టమే
వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళ్లడం మనకు కొంత నష్టమేనని, కేంద్రంలో దక్షిణాది గొంతు వినిపించే అవకాశం పోయిందని కేసీఆర్‌ పేర్కొన్నారు. మన సమస్యలు సులభంగా వినిపించే వెసులుబాటు పోయిందని.. ఆ స్థాయి నాయకుడు ఎదగడం ఇప్పట్లో కష్టమేనని వ్యాఖ్యానించారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో పరిపాలనా పరమైన సమస్యల కారణంగా తగిన ఫలితాలేవీ రాలేదని.. అసలు తొలి ఐదారు నెలలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని కేసీఆర్‌ చెప్పారు. 2015–16 తర్వాత రాష్ట్రం గాడిన పడిందని పేర్కొన్నారు. ఎన్నో సరికొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని.. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభావవంతమైన విధానాలను అమలు చేశామని తెలిపారు. గ్యాంబ్లింగ్, పేకాటలను నిషేధించామని, కల్తీ విత్తనాలు సహా ఇతర అక్రమాలకు పాల్పడే ముఠాలను నియంత్రించామని చెప్పారు. కరెంటు కోతలతో అల్లాడిన పరిస్థితి నుంచి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మార్చుతున్నామన్నారు. రాష్ట్రంలో భూవివాదాలకు చెక్‌ పెట్టేందుకు భారీ స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. వ్యవసాయం తప్ప వేరే ఆదాయం లేని రైతులు ఎంతో నిరాశలో ఉన్నారని.. వారిని ఆదుకునేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని.. ఏటా ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నామని వెల్లడించారు. ముస్లింలు అభద్రతాభావం వీడి ప్రధాన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోందని చెప్పారు.

ఆర్థికాభివృద్ధిలో నంబర్‌ వన్‌
27 శాతం అభివృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందని, దేశాన్ని పోషిస్తున్న ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.50 వేల కోట్లు వెళుతుంటే.. కేంద్రం తిరిగి ఇస్తున్నది 24 వేల కోట్లేనని చెప్పారు. వినూత్న పారిశ్రామిక విధానం వల్ల స్వల్పకాలంలోనే నాలుగు వేల పైచీలుకు పరిశ్రమలు వచ్చాయన్నారు. అయితే నోట్ల రద్దు కారణంగా రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్‌ రంగం కుదేలైందని.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని పేర్కొన్నారు. జీఎస్టీతో తెలంగాణ రెవెన్యూ పెరుగుతుందన్నారు.

ఏపీతో ఇచ్చి, పుచ్చుకుంటాం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలూ పూర్తి సహాయ సహకారాలతో.. స్నేహపూర్వక పోటీతో ముందుకు పోవాలని భావిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. జలాలు సహా ఏ అంశంపై అయినా వివాదాలు తలెత్తవని ఆశిస్తున్నానని.. ఇచ్చి, పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తామని తెలిపారు. తెలంగాణలో ఆంధ్రా వారు అభద్రతాభావంతో ఉన్నారన్న ప్రచారం ఇప్పుడు తొలగిపోయిందని.. హైదరాబాద్‌లో ఇప్పుడు ఆంధ్రావారే తమకు పెద్ద బలంగా తయారయ్యారని వ్యాఖ్యానించారు.

అందరికీ ప్రభుత్వోద్యోగాలు సాధ్యం కాదు
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని.. ఉపాధి పొందే మార్గాలను సృష్టించడమే ప్రభుత్వాల బాధ్యత అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని, మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచేది లేదని స్పష్టం చేశారు.

అకున్‌ బృందానికి పూర్తి అధికారాలు
హైదరాబాద్, ముంబై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌ వంటి నగరాల్లో డ్రగ్స్‌ కల్చర్‌ ఉందని.. ఈ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అందులో భాగంగానే తాజాగా డ్రగ్స్‌ దందాపై కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు, కల్తీ వస్తువులపై తనిఖీలు చేస్తున్నప్పుడు డ్రగ్స్‌ తీగ కదిలిందని.. దానిని లాగితే డొంకంతా కదులుతోందని చెప్పారు. డ్రగ్స్‌ వ్యవహారంపై విచారణ చేస్తున్న అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలోని సిట్‌కు పూర్తి అధికారాలు ఇచ్చామని, ఈ కేసుల్లో ఎంతటి వారున్నా వదలబోమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ మాఫియా పాత్ర కూడా బయటికి వస్తోందని తెలిపారు.

పవన్‌ చేతులూపితే ఓట్లు పడతాయా?
తెలంగాణలో కుల రాజకీయాలు లేవని, ఎన్నికలప్పుడు ప్రజా అంశాలే ప్రాధాన్యత వహిస్తాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. అదే ఏపీలో మాత్రం కుల రాజకీయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయని వ్యాఖ్యానించారు. ‘‘పవన్‌ కల్యాణ్‌ చేతులూపితే ఓట్లు పడతాయా..? పార్టీకి బేస్‌ ఉండాలి. చిరంజీవి లాంటి వ్యక్తే పార్టీని నడపలేక కట్టెలమోపులాగా బరువు దించుకున్నారు. నేను 14 ఏళ్లు పార్టీ నడిపా, ఉద్యమం చేశాను. ఎవరైనా పోరాటానికి సిద్ధంగా ఉండాలి, లక్ష్యం కోసం పనిచేయాలి..’’అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితిపై చేసిన సర్వే వివరాలను ఓ మిత్రుడు తనకు చెప్పాడని.. వైఎస్సార్‌సీపీకి 45 శాతం ఓట్లు, టీడీపీకి 43 శాతం, బీజేపీకి 2.6 శాతం, పవన్‌ కల్యాణ్‌కు 1–1.2 శాతం ఓట్లు వస్తాయని ఆ సర్వేలో తేలిందని వెల్లడించారు.

రాష్ట్రపతిని కలసిన కేసీఆర్‌
ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన కోవింద్‌
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన నేపథ్యంలో గురువారం రాష్ట్రపతి భవన్‌లో కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో తనకు మద్దతు పలికినందుకు కేసీఆర్‌కు కోవింద్‌ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతిని కలసిన వారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సలహాదారు వివేక్, ఎంపీలు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కవిత, కొండా విశ్వేశ్వరరెడ్డి, సీతారాంనాయక్, జి.నగేశ్, బీబీ పాటిల్, బాల్క సుమన్, మల్లారెడ్డి, పసునూరి దయాకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement