
నల్లగొండ జిల్లా /శాలిగౌరారం(నకిరేకల్): రానున్న సాధారణ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాలన్నింటిలో టీఆర్‌ఎస్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. ఊట్కూరు గ్రామంలో వాటర్‌ప్లాంటు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఏమిచేయలేరన్నారు. సీఎం కేసీఆర్ మాయమాటలకు మరోసారి మోసపోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అబద్దాలు ఆడడంలో సీఎం గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని, మరెవరూ ఆ రికార్డుకు చేరుకోలేరన్నారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని చేయివ్వడంతో ప్రారంభమైన ఆయన మోసాలు దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం, ప్రతి గ్రామంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు నిర్మించడం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పడం, కేటీ టుపీజీ విద్య ఇలా కొనసాగుతున్నాయన్నారు.బంగారు తెలంగాణ దేవుడెరుగు..అప్పుల తెలంగాణగా రాష్ట్రం మారిందని చెప్పారు. పంటలు నష్టపోయి వందల మంది రైతులు అత్మహత్యలకు పాల్పడితే ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు సమయం దొరకని కేసీఆర్ ప్రజాధనంతో హెలికాప్టర్లలో ఇతర రాష్ట్రాలలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలకు వెళ్లేందుకు మాత్రం సమయం దొరుకుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని,తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభలో స్థానిక సర్పంచ్ వేముల శైలజఅశోక్, నాయకులు మురారిశెట్టి కృష్ణమూర్తి, తాళ్లూరి మురళి, బండపల్లి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment