9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 9 నుండి ప్రారంభం కానున్నాయి. ఈలోపే శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ముగ్గురు విప్‌లు వంటివాటిపై ఒక నిర్ణయానికి రానున్నారు. 12 మందితో కొలువైన మంత్రివర్గంలో అవకాశం రాని సీనియర్లను శాసనసభ పదవుల్లో భర్తీ చేయనున్నారు. పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవిని ఇవ్వాలని నిర్ణయించారు. ఆయనకు మంత్రివర్గంలోనే అవకాశం ఇవ్వాలని అనుకున్నా స్పీకర్‌గా చేయాలనే నిర్ణయం వల్ల ఇవ్వలేకపోయారు. స్పీకర్ పదవి కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేరును కేసీఆర్ ముందుగా అనుకున్నారు. కేబినెట్‌లోనే అవకాశం కావాలని, స్పీకర్‌గా చేయలేనని పోచారం చెప్పడంతో కొప్పుల ఈశ్వర్‌ను నిర్ణయించినట్టుతెలిసింది.
అంతకుముందు జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్, సిరికొండ మధుసూదనాచారి పేర్లను కూడా కేసీఆర్ పరిశీలించారు. కీలకమైన సభాధ్యక్ష పదవిని కూడా ‘వెలమ’ సామాజికవర్గానికే ఇస్తే విమర్శలు వస్తాయనే కారణంతో జూపల్లి పేరును విరమించుకున్నారు. చందూలాల్, మధుుసూదనాచారి స్పీకర్ పదవిపై విముఖంగా ఉన్నారు. దీనితో కొప్పుల పేరును దాదాపుగా ఖరారు చేశారు.
చీఫ్‌విప్ పదవిని మధుసూదనాచారికి ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ పదవులను మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో భర్తీ చేయాలనుకుంటున్నారు. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన ఆరు పదవులను భర్తీ చేయడం ద్వారా మంత్రివర్గ ఆశావహుల జాబితాను కుదించాలని కేసీఆర్ వ్యూహంతో ఉన్నారు. సీనియర్లను, మంత్రివర్గంలో బెర్తును ఆశించి భంగపడేవారిని అసెంబ్లీకి సంబంధించిన పదవులతో సంతృప్తి పరిచిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణను చేపట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారు.