భూఫలహారం  | Assigned Lands Regularisation In Karimnagar | Sakshi
Sakshi News home page

భూఫలహారం 

Published Wed, Feb 27 2019 9:57 AM | Last Updated on Wed, Feb 27 2019 9:57 AM

Assigned Lands Regularisation In Karimnagar - Sakshi

ధర్మారంలో సర్వే నిర్వహిస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఒకటి కాదు, రెండు కాదు...  ఏకంగా 358 ఎకరాల సర్కారు భూమి. 20 ఏళ్ల క్రితం వరకు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్న ఈ భూమి అసైన్డ్‌ రూపంలో కనుమరుగవడం మొదలైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌కు సమీపంలో ఉన్న 476 సర్వే నంబర్‌లోని ఈ భూమి గత కొన్నేళ్లుగా ఎక్కడికక్కడ కబ్జాకు గురైంది. ఇళ్ల నిర్మాణం కోసం ‘ఏదోలా’ గుంట, గుంటన్నరకు పట్టాలు తెచ్చుకోవడం.. దానికి రెండు మూడింతలు ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకోవడం పరిపాటిగా మారింది. దీంతో గత పదేళ్లలో ఈ భూమికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ యజమానులు తయారయ్యారు.

అసైన్‌మెంట్‌ కమిటీతో సంబంధం లేకుండా తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు తలుచుకున్నదే తడువు... గుంటల కొద్దీ భూములకు పట్టాలు తయారయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు సాగిన ఈ దందా అప్పటి కలెక్టర్‌ ఆదేశాలతో నిలిచిపోయినా తాజాగా మళ్లీ మొదలైంది. ఈ సర్వే నంబర్‌లోని 358 ఎకరాల భూమిలో కబ్జాలు పెరిగిపోయాయని, ఒకే కుటుంబం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇతర సభ్యులకు సైతం అసైన్‌మెంట్లు జరిగాయని పెద్దపల్లి జాయింట్‌ కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జేసీ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మండల తహసీల్దార్‌ సంపత్‌ ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికా రులు హుటాహుటిన ధర్మారం వెళ్లారు. సోమ, మంగళవారాల్లో మండల కేంద్రం లోనే భూరికార్డులను పరిశీలిస్తూ,
అసైన్‌మెంట్, కబ్జా భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు.

1998 నుంచే పందేరం
సర్వే నంబర్‌ 476లోని 358.07 ఎకరాల ప్రభుత్వ భూమిలో 1998–99 సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డు సమీపంలో స్థానికులైన ఎనిమిది మందికి ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో గుంటన్నర చొప్పున స్థలాలను కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన భూపందేరం ఆగలేదు. ఎవరైనా అడిగిందే తడువుగా ఈ ప్రభుత్వ భూమిలో గుంటల కొద్దీ రాసిచ్చేశారు. అర్హుల పేరిట గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు సర్కారు భూమిని ఆక్రమించుకున్నారు. భూమి లేని పేదలు, అనాథల పేరుతో కొందరు అనర్హులకు సైతం ఎకరాల చొప్పున కట్టబెట్టారు. ఒక కుటుంబంలో ఒకరికి భూమి లభించగానే, ఆయన దగ్గరి బంధువులకు కూడా పేదల పేరిట ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తూ పోవడంతో ఇప్పుడు సర్కారు భూమి ఎంత మిగిలి ఉందో కూడా రెవెన్యూ అధికారులకే తెలియని పరిస్థితి.

రిటైర్డ్‌ అయిన తహసీల్దార్ల దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్స్‌ తయారు చేయించి కూడా ఇక్కడ భూములను కాజేశారనే ఫిర్యాదులు సైతం ఉన్నాయి. పదేళ్లలో ఇక్కడ తహసీల్దార్లుగా పనిచేసిన వారు, వీఆర్‌ఓల కనుసన్నల్లోనే విలువైన భూమి ఫలహారంగా మారిందని స్థానికులు చెపుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి మొదలు జెడ్‌పీటీసీ, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధుల నోటిమాటే వేదంగా భూపందేరం జరిగాయని సమాచారం. మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు ఉన్న ఎనిమిది గుంటల పట్టా భూమికి 4 గుంటల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతారు. పేదల కోసం గుంట, రెండు గుంటల భూమి కేటాయిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 5 నుంచి 7 గుంటల వరకు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని పెద్దపల్లి జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో జేసీ దీనిని అత్యంత ముఖ్యమైన ఫిర్యాదుగా భావించాలని ఆదేశిస్తూ తహసీల్దార్‌కు సిఫారసు చేశారు.

మళ్లీ మొదలైన సర్వే!
476 సర్వే నంబర్‌లో ఉన్న సర్కారు భూమిలో నుంచి పేదలు, దళితులకు అసైన్డ్‌ చేసిన భూమి ఎంత? ఎలాంటి అసైన్‌మెంట్‌ ఆర్డర్‌ లేకుండా ఆక్రమణలోకి వెళ్లిన భూమి ఎంత అనే విషయాలను తేల్చేందుకు తహసీల్దార్‌ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కేటాయించిన భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా కొలతలు తీస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ హద్దులు నిర్ణయించి, ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్‌ సంపత్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement