రాష్ట్ర ప్రభుత్వాలైనా రైల్వేగేట్లు పెట్టించాలి: వైఎస్ జగన్
మెదక్ జిల్లాలో స్కూలుబస్సును రైలు ఢీకొన్న ప్రాంతంలో రైల్వే గేటు కావాలని అక్కడి ప్రజలు మూడుసార్లు ధర్నా చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని.. ఇప్పటికైనా రైల్వేశాఖ, వాళ్లు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలైనా ముందుకొచ్చి కాపలా లేని రైల్వేక్రాసింగులు ఉన్నచోటల్లా కాపలాతో కూడిన గేట్లు పెట్టించాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దాదాపు 20 మంది చిన్నారులు మరణించిన సంఘటన స్థలం వద్దకు ఆయన గురువారం ఉదయమే వెళ్లి బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
''ఇది చాలా బాధాకరం. 20 మంది పిల్లలు మరణించారు. అక్కడకు వెళ్లి చూసినప్పుడు వాళ్ల పుస్తకాలు కూడా అక్కడక్కడ పడి ఉన్నాయి. ఒక పుస్తకం చూస్తే, ఆ పిల్లాడు ఒకటో తరగతి చదువుతున్నాడు. ఇంతమంది పిల్లలు చనిపోవడం చూస్తే చాలా బాధ అనిపిస్తోంది. అక్కడ గేటు కావాలని స్థానికులు మూడుసార్లు ధర్నాలు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి గేటులేని క్రాసింగులు చూస్తే, ఆ ఒక్క సెక్షన్లోనే మూడున్నాయి. రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా చూడాలి. గేటులేని ప్రతిచోటా గేట్లు పెట్టించే కార్యక్రమాలు రైల్వేశాఖ చేస్తుందో లేదో తెలీదు గానీ.. వాళ్లు చేయాలి. లేనిపక్షంలో మనం మన పిల్లలని మనసులో పెట్టుకుని.. అవసరమైతే రెండువేల కోట్లో.. లేదంటే ఎంతోకొంత బడ్జెట్ కేటాయించి ప్రతిచోటా మ్యాన్డ్ గేట్లు పెట్టించాలని, నాలుగు అడుగులు ముందుకేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇక్కడ ఎవరినో విమర్శిస్తే ఏమీ లాభం లేదు. మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలో ఆలోచించాలి. అక్కడ ఆరేడేళ్ల వయసున్న పిల్లలున్నారు. వాళ్లను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండాప్రభుత్వాలు ముందుకు రావాలి. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ భయపడే స్థాయిలో నష్టపరిహారం ఇప్పించాలి. ఇందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి స్పందిస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల పరిహారం ఇచ్చినట్లు విన్నాను. దాంతో సరిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి, ఇలాంటి తప్పిదాలు మళ్లీ జరగకుండా నష్టపరిహారం కోసం ప్రయత్నించాలి. ఇక్కడ కూడా పెద్దలైతే 5 లక్షలు సరిపోవచ్చేమో గానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు మరణించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని రెట్టింపు చేయాలని కోరుతున్నాను. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ప్రభుత్వం కూడా మానవత్వం ప్రదర్శిస్తే మంచిది. పార్టీ తరఫున కూడా చేయాల్సిందంతా చేస్తాం'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.