పౌరసరఫరాల శాఖలోని 24 మంది సిబ్బంది ప్రతినెలా రేషన్ దుకాణాలు, పెట్రోల్ బంకులు, కి రోసిన్ డీలర్లపై తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వీరు నెలలో ఒక్కొక్కరు కనీసం పది తనిఖీలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 24 మంది సిబ్బంది నెలకు కనీసం 240 తనిఖీలు చేయాలి. ఆ మేరకు కేసులు నమోదు చేయాలి. కానీ ఈ ఏడాది ఇప్పటికే 8 మాసాలు గడిచిపోయాయి. ఈ ఎనిమిది మాసాల్లో 1920 తనిఖీలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 150 కేసులు మాత్రమే 6 ‘ఏ’ కింద నమోదు చేశారు.
నీలగిరి :మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. సన్న బియ్యం ధరలు ఎగబాకి సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినా జిల్లా పౌరసరఫరాలశాఖ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మొద్దునిద్ర పోతోందన్న విమర్శలు వినవస్తున్నాయి. గతేడాది జిల్లాలో పంటలసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా మార్కెట్లో బియ్యం, ఇతర వ స్తువుల ధరలు అదుపులో లేవు. కొందరు వ్యాపారులు, రైస్‌మిల్లర్లు నిత్యావసర వస్తువులు, బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి మార్కెట్‌ను శాసిస్తున్నారు. ధరల పెరుగుదలపై నియంత్రణ లేకపోవడంతో వ్యాపారులు, మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
కానీ జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమ నిల్వలు, రేషన్ బియ్యం విషయంలో పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువ చేయాల్సి ఉండగా అధికారులు వాటివైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. గతేడాది తనిఖీలతో పోల్చితే ఈ ఏడాది అధికారుల దూకుడు తగ్గినట్లుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో గత ఐదారుమాసాల నుంచి నిత్యావసర వస్తువుల ధరలు, సన్న బియ్యం ధరలు మార్కెట్లో అమాంతంగా పెరిగాయి.
ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పకుండా చూడడం...ఆహార సలహా సంఘం కమిటీ (ఎఫ్‌ఏసీ) సమావేశం నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా...దీనిపై జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎఫ్‌ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. గతేడాది ఆగస్టులో ఎఫ్‌ఏసీ సమావేశం జరిగింది. సమావేశం జరిగి 13 నెలలు దాటినా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు.
నిఘా.. నిద్ర
Published Thu, Sep 4 2014 3:56 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM
Advertisement
Advertisement