సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన విశేష పురస్కారాల అంశం ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య వివాదం రేపింది. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 4 అఖిల భారత సర్వీసు అధికారులను సన్మానించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాహిత కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణ, ఐపీఎస్ అధికారులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సీవీ ఆనంద్, ఐఎఫ్‌ఎస్ అధికారి ఎండీ షఫీ ఉల్లాను సీఎం సత్కరించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ఈ నలుగురి పేర్లను ప్రకటించడం అందులో ఇద్దరు ఐపీఎస్ అధికారులుండటం ఐఏఎస్ అధికారుల్లో చర్చకు తెరలేపింది. కొంతకాలంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య ప్రచ్ఛన్న వివాదం కొనసాగుతోంది. ఐపీఎస్‌లకు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఇవ్వొద్దని ఐఏఎస్‌లు వాదిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణను ప్రవీణ్‌కుమార్‌కు, పౌరసరఫరాల విభాగాన్ని సీవీ ఆనంద్‌కు అప్పగించింది. ఇప్పుడు వారికి ఏకంగా అవార్డులు ప్రకటించటంతో కొందరు ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విశేష సేవలందించే పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఏటా పలు సేవా పతకాలు, మెడల్స్‌ను అందజేస్తున్నాయి. ఈ జాబితాలో అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు చోటు లేనప్పుడు ఎక్సలెన్స్ అవార్డులను ఐపీఎస్‌లకు ఎందుకు ఇవ్వాలనే వాదన వినిపిస్తున్నారు. ఐపీఎస్‌లకు ఎక్సలెన్స్ అవార్డులు ఎలా ఇస్తారని ఓ సీనియర్ ఐఏఎస్ పెదవివిరిచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టినా సంబంధిత అవార్డు గ్రహీతల్లో ఒక్క ఐఎఫ్‌ఎస్ అధికారికి కూడా చోటు దక్కకపోవటమూ ఆ వర్గాల్లో చర్చకు తెరలేపింది.
ఐఏఎస్, ఐపీఎస్‌ల మధ్య అవార్డుల వివాదం
Published Wed, Aug 16 2017 2:15 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
Advertisement