సామాజిక చైతన్యం కోసం గోల్కొండ అంచుల్లో సెల్ఫీ దిగుతున్న మోడల్(ఫైల్)
జూబ్లీహిల్స్: సరదా కోసం సొంతంగా సెల్‌ఫోన్‌లో తీసుకునే ఫొటో సెల్ఫీ ప్రస్తుతం వేలం వెర్రిగా మారింది. అయితే, ఈ సరదా తరచూ ప్రాణాంతకంగా మారుతోందని, ఎందరో ప్రాణాలను సైతం హరిస్తోందని తాజా అధ్యయనం చెబుతోంది. కొండకోనలు, స్కై స్కాపర్లు, రైల్యేలైన్లు, సముద్రతీరాలు.. ఇలా ఇక్కడా అక్కడా అనికాకుండా ఎక్కడపడితే అక్కడ సెల్ఫీలు దిగుతూ పలువురు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ‘జర్నల్ ఆఫ్ ఫ్యామిలీ మెడిసిన్ అండ్ ప్రైమరీ కేర్’ అనే మెడికల్ జర్నల్ తాజా అధ్యయనంలో ఈ విషయాలను వెల్లడించింది. అక్టోబర్ 2011 నుంచి నవంబర్ 2017 వరకు చేసిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. సెల్ఫీలు దిగుతూ దేశవ్యాప్తంగా కనీసం 259 మంది మృత్యువాత పడ్డారని, అంతకంటే ఎక్కువ మంది గాయపడ్డారని పేర్కొంది.
ఇదేకాలంలో అమెరికాలో 14 మంది, రష్యాలో 16 మంది, పాకిస్థాన్‌లో 14 మంది మృతి చెందారని పేర్కొంది. ఇదే సమయంలో ప్రమాదరక షార్క్ చేపల దాడుల్లో కేవలం 50 మంది మాత్రమే మృతి చెందిన విషయాన్ని గుర్తుచేసింది. దాదాపు 120 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా సెల్‌ఫోన్లు వాడుతున్నారని, వీరిలో ఎక్కువగా యువతనని పేర్కొంది. సెల్ఫీలు దిగడం ఒకవెర్రిలా మారిపోయిందని, చిత్ర విచిత్రమైన పద్ధతులు, పరిస్థితుల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోతున్నారని అధ్యయనం పేర్కొంది. ఓ యువతి కెనడాలో పర్వతం అధిరోహిస్తూ సెల్ఫీ దిగే ప్రయత్నంలో కలు జారిపోయి చనిపోయిందని, కొందరు శవయాత్రల్లో సెల్ఫీలు దిగుతున్నారని, జర్మనీలోని నాజీ డెత్ క్యాంపుల్లో సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తున్నారని, మరికొందరు ట్రాఫిక్ రద్దీలో బైక్ నడుపుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారని పేర్కొంది. ఇక దేశంలోని పలు పర్యాటక ప్రాంతాల్లో సెల్ఫీల రద్దీ పెరిగిపోయి స్థానికులకు ఇబ్బందిగా మారినట్టు పేర్కొంది. సెల్ఫీ వేలంవెర్రిని అదుపు చేయలేక ముంబైలో పోలీసులు ఏకంగా 16 ప్రాంతాలను ‘నో సెల్ఫీజోన్స్’గా ప్రకటించారంది. స్వీయ నియంత్రణ, సంయమనంతో సెల్ఫీ జాడ్యాన్ని అధిగమించాలని జర్నల్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment