గాలి తగిలితే శరీరం జివ్వుమంటుంది. నీళ్లు తగిలితే చాలు వణుకు పుడుతుంది. చలికాంలో ఇవి ప్రత్యక్షంగా అందరూ అనుభవించేవే. ఇవిగాక ఈ కాలంలో పరోక్షంగా వచ్చే శారీరక సమస్యలు మరెన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒళ్లు, కీళ్ల నొప్పులు ప్రధానమైనవి. ప్రస్తుతం ఈ సమస్యలతో తమను సంప్రదించేవారు పెరిగారంటున్నారు అపోలో ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కౌశిక్‌రెడ్డి. ఈ సమస్య గురించి, దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన పలు సూచనలు చెబుతున్నారు.
సాక్షి, సిటీబ్యూరో :వింటర్ (చలికాలం) సీజన్‌లో శరీర అవయవాలు కదలమని మొరాయించడం, తరచుగా పట్టేసినట్టు ఉండడం సహజం. రక్తప్రసరణలో ఏర్పడే లోపాలు ఇందుకు ప్రధాన కారణం. చలి వాతావరణం వల్ల ఏర్పడే ఈ లోపం కారణంగా గాలిలో ఒత్తిడి తగ్గి కీళ్ల చుట్టూ ఉన్న నరాలు ఉబ్బుతాయి. మనకు తెలియకుండానే శారీరక కదలికలు మందగిస్తాయి. దీంతో కీళ్లు బిగుసుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నొప్పులకు ఓ కారణమవుతుంది. ఎక్కువగా మోకాలి నొప్పులు, భుజాల నొప్పులు, ఫింగర్ జాయింట్స్‌లో సర్వసాధారణంగా ఉంటాయి. ఇవి కాకుండా ఎవరైనా దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతుంటే అవి ఈ సీజన్‌లో మరింతగా పెరుగుతాయి.
ఈ సీజన్‌లో వ్యాయామం చేయాల్సిందే
సిటీలో కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువ. సమ్మర్ సీజన్‌లో కూడా సమస్యలకు కారణమయ్యే ఇలాంటి జీవనశైలితో చలికాలం మరిన్ని ఇబ్బందులు తప్పవు. మరోవైపు కాస్త రెగ్యులర్‌గా వర్కవుట్ చేసే వాళ్లు కూడా బద్ధకించే సీజన్ ఇది. అయితే, తప్పనిసరిగా వ్యాయామం చేయాల్సిన వాతావరణం కూడా ఇదే. శరీరానికి అవసరమైన ఉష్టోగ్రతను సహజంగా అందించడానికి, కదలికలను మెరుగుపరచడానికి, రక్తప్రసరణ లోపాలను సరిచేయడానికి, కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారడానికి వ్యాయామం ఉపకరిస్తుంది. అయితే వెయిట్స్‌తో చేసే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటి వ్యాయామాల కన్నా, స్ట్రెచ్చింగ్, యోగా వంటివి చాలా మంచిది. అలాగే సవ్యమైన రీతిలో శరీరానికి చేసే మసాజ్ కూడా ఉపకరిస్తుంది.
వెచ్చని నీరుతో ఉపశమనం
ఈ కాలంలో తరచుగా వేడి నీళ్లు తాగాలి. మరీ గొంతు కాలే వేడి కాకుండా కాసింత వేడి నీళ్లు తాగడం చాలా మంచిది. ఓ మోస్తరు వేడి నీళ్లు రోజు మొత్తం మీద అప్పుడప్పుడు తాగడం నొప్పులకు పరిష్కారంగా పనిచేస్తుంది. స్నానానికి కూడా తగినంత వేడి ఉన్న నీటిని వినియోగించాలి. ఆహారంగా.. క్యాబేజీ, పినాచె, ఆకు కూరలు, కాయగూరలు వంటివి నొప్పి నివారిణిగా పనికొస్తాయి. వీటిలో ఉండే విటమిన్ ‘కె’ నొప్పి నివారణకు ఔషధంగా ఉపకరిస్తుంది. కమలాలు, టమాటాలు వంటి వాటిలో విటమిన్ ‘సి’ కూడా ఉపయుక్తమే. ఇది కీళ్ల మధ్యలోని కార్టిలేజ్ భాగం డ్యామేజ్ అవకుండా చేస్తుంది. మరీ అవసరమైతే తప్ప పెయిన్ రిలీఫ్ మందులు వాడవద్దు. ఆహారం రూపంలో గాని, లేదా క్యాప్సూల్స్ రూపంలో గాని ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే నొప్పులు పెరగకుండా ఉపకరిస్తుంది. ఈ సీజన్‌లో మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దళసరి, వెచ్చదనాన్ని అందించే దుస్తులు ధరించడం, సూర్యకాంతి వంటికి తగిలేలా చూసుకోవడం, విటమిన్ డి, ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవడం కూడా నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment