కొత్తగూడెం (ఖమ్మం) : ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేయసి దూరమవడంతో.. జీవించడం వృధా అనుకున్న ఓ భగ్న ప్రేమికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని సుజాతా నగర్ పంచాయతీ నాయకుల గూడెం గ్రామానికి చెందిన ఓడుగు సంతోష్(21) ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
అదే గ్రామానికి చెందిన బాలు వినీల(19) డిప్లొమా చివరి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఇరువురి మనసులు కలిశాయి. ప్రేమ జంట చెట్టపట్టాలేసుకొని తిరిగారు. ఈ సంవత్సరంతో చదువులు పూర్తవుతుండటంతో.. ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసిపోయిందనే భయంతో గురువారం రాత్రి వినీల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం మృతి చెందింది.
ఈ విషయం తెలిసిన సంతోష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం చేయాలో తోచక తన ప్రియురాలు లేని లోకంలో తాను బతకలేనని కళాశాల ప్రాంగణంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థులు అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రియురాలు లేని లోకంలో ఉండలేక..
Published Fri, Oct 30 2015 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM
Advertisement
Advertisement