చిట్టి వెన్నుపై గుట్టంత బరువు | Bags Weight Burden on School Students | Sakshi
Sakshi News home page

చిట్టి వెన్నుపై గుట్టంత బరువు

Published Mon, Jun 24 2019 8:12 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Bags Weight Burden on School Students - Sakshi

ఒక విద్యార్థి తన మొత్తం శరీర బరువులో 10 నుంచి 15 శాతానికి మించి బరువు మోయ కూడదు. కానీ నగరంలో నూటికి 90 శాతం మంది తమ బరువు కంటే ఎక్కువగా పుస్తకాల బరువును మోస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు, పాఠశాలల్లో సుమారు 10 లక్షల మంది చిన్నారులు చదువుతుండగా, వీరిలో ప్రతి వందమందిలో 20 మంది వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తేలింది. వెన్నునొప్పితో బాధపడుతూ ఇటీవల వైద్యులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమతోంది.

సాక్షి, సిటీబ్యూరో :ఆటలతో అలసిపోవాల్సిన చిన్నారుల శరీరం బండెడు పుస్తకాల బరువుతో నీరసిస్తోంది. నిటారుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగాల్సిన వెన్నుపూస.. పది, పదిహేనేళ్లకే వంకర్లు పోతోంది.
కిండర్‌ గార్డెన్‌ చదువులోనే కేజీల బరువు మోయలేని భారంగా తయారైంది. బడిలో చేరిన నాటినుంచే కొండంత ఎత్తుకు ఎదగాలన్న తల్లిదండ్రుల ఆశ చిన్నారులు మోస్తున్న బరువుపై ఆలోచింపజేయనివ్వడంలేదు. మెల్‌బోర్న్‌ యూనివర్సిటీ ఇటీవల విద్యార్థులు ఎత్తుతున్న పుస్తకాల బరువుపై ఓ సర్వే నిర్వహించింది. విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించి, బరువు మోయని వారు, స్వల్ప బరువు మోస్తున్నవారు, తగినంత బరువు మోస్తున్నవారు, అధిక బరువు మోస్తున్న వారు ఇలా సుమారు 1400 మంది బడిపిల్లలను ప్రాతిపదికగా తీసుకుంది. ఇందులో అధిక బరువు మోస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటే.. ఎక్కువ బరువు మోస్తున్న వారిలోనే వెన్నుపూస సమస్యలు వస్తున్నట్టు నిర్ధారించింది. విద్యార్థి బరువు కంటే అతను భుజాన మోస్తున్న పుస్తకాల బ్యాగు బరువు 30 శాతానికి మించి ఉన్నట్లు తేలింది.

బ్యాగు అమరిక ఇలా ఉండాలి..
బ్యాగు వెడల్పు ఛాతీకి మించకుండా ఉండేలా చూసుకోవాలి
బ్యాగు పొడవు ఎక్కువ ఉండకూడదు
బ్యాగు వేసుకుని కూర్చున్నప్పుడు బల్లను బ్యాగు తాకకూడదు
వెడల్పు పట్టీలు ఉన్న బ్యాగును వాడాలి
బరువైన పుస్తకాలను వెన్నుకు సమీపంలో, తేలికైనవి బ్యాగు చివర్లో ఉంచాలి
బ్యాగు బరువు రెండు భుజాలపై సమానంగా ఉండేలా చూసుకోవాలి

అధిక బరువుతో వచ్చే సమస్యలివే..
సాధారణంగా చిన్నారుల్లో డిస్కుల అరుగుదల సమస్య ఉండదు. కానీ చిన్నతనంలో అధిక బరువు మోయడం వల్ల వెన్ను వంకర్లు పోవడం, సమస్యలు రావడంతో ఇలాంటి వారికి 35 ఏళ్లు దాటిన తర్వాత డిస్కుల అరుగుదల మొదలైనప్పుడు మరిన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. బరువుతో భుజాలకు ఇరువైపులా ఉన్న కండరాలు అలసిపోతాయి. తరగతి గదిలో ఎక్కువసేపు కూర్చోలేకపోతూంటారు. వెన్నెముక సహజంగా ఎస్‌ ఆకారంలో ఉంటుంది. ఇందులో మార్పు సంభవిస్తుంది.అధిక బరువు కారణంగా నడుము నొప్పి రావడం, ఎల్‌–4, ఎల్‌–5 మధ్య, ఎల్‌–5, ఎస్‌–1 భాగాల మధ్య డిస్కులు జారిపోతాయి. భుజాలకు, వెన్నెముకకు మధ్య బ్యాలెన్స్‌ లేకుండాపోతుంది. చిన్నప్పప్పుడు వచ్చిన ఈ సమస్య పెద్దయ్యాక వస్తున్న వారిలో ఎక్కువ మంది ఉన్నారు. స్కూలు బ్యాగు బరువుతోనే కాకుండా దాని వాడకంలోనూ జాగ్రత్తలు పాటిస్తే ఉత్తమం.

శరీర బరువు కంటే పుస్తకాల భారం 15 శాతం మించకూడదు
పది కేజీల బరువు ఉన్న విద్యార్థి కేజీ నుంచి కేజీన్నర బరువుకు మించి పుస్తకాలు మోయకూడదు. స్కూలు బ్యాగు తగిలించుకున్నా వెన్నెముక నిటారుగా ఉండాలి. అలా లేదం టే ప్రమాదం వస్తున్నట్టు భావించాలి. వెన్నుపూస సమస్య వచ్చి ఉంటే కచ్చితంగా ఆడ మ్స్‌ టెస్ట్‌ చేయించాలి. అంటే రెండు పాదా లు దగ్గరగా తెచ్చి మోకాళ్లు వంచకుండా నడుము కిందకు వంచాలి. అప్పుడు భుజాలు రెండూ ఒకే స్థాయిలో లేకపోతే వెన్నునొ ప్పి ఉన్నట్టు గుర్తించాలి. పుట్టుకతోనే వెన్నులోపంతోబాధపడే వారికి ఇది మరింత ఇబ్బంది.   – డాక్టర్‌ కమల్,జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌

స్కూల్లోనే ప్రత్యేక ర్యాక్‌లుఏర్పాటు చేయాలి
విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించేందుకు చాలా పాఠశాలలు ప్రత్యేక సబ్జెక్టుల పేరుతో అవసరానికి మించి పుస్తకాలు, నోటుబుక్స్‌ కొనుగోలు చేయిస్తోంది. పైఅంతస్తుల్లోని తరగతి గదులకు చేరుకునేందుకు కనీసం లిఫ్ట్‌లు కూడా లేవు. దీంతో శక్తికి మించిన బరువును భుజాన మోస్తూ మెట్లపై నుంచి పై అంతస్తులకు చేరుకోవాల్సి వస్తుంది. పుస్తకాల బరువు, వెన్నుపైనే కాకుండా మోకీళ్లపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వెన్ను, మోకాలి నొప్పులతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయంగా పాఠశాలల యాజమాన్యాలే తరగతి గదుల్లో ప్రత్యేక ర్యాక్‌లను ఏర్పాటు చేయాలి. అవసరమైన పుస్తకాలనే ఇంటికి పంపాలి. అవసరం లేనివి స్కూల్లోనే ర్యాక్‌లో భద్రపర్చడం ద్వారా పిల్లపై భారాన్ని తగ్గించవచ్చు.  – అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement