కామారెడ్డి అర్బన్: కామారెడ్డి శాసన సభ్యుడిగా 1978 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కేవలం రూ. 24 వేల వ్యయంతో ఎన్నికయ్యానని బ్రాహ్మణపల్లి బాలయ్య తెలిపారు. 1963 నుంచి 1978 వరకు కామారెడ్డి గ్రామపంచాయతీలో వార్డు సభ్యుడిగా, ఉపసర్పంచ్‌గా పనిచేసిన తనకు ఇందిరా కాంగ్రెస్ తరపున పిలిచి టిక్కెట్ ఇచ్చారని తాను ఖర్చు భరించలేనని పేర్కొనడంతో అప్పటి జిల్లా మంత్రి అర్గుల్ రాజారాం ఒప్పించి నామినేషన్ వేయించారని పేర్కొన్నారు.
నామినేషన్ రుసుము రూ. 250 కోసం తన తల్లి పుస్తెబంగారాన్ని తాకట్టు పెట్టడగా రూ. 300 వచ్చాయన్నారు. కటికె బాలోజి అనే స్నేహితుడు రూ. 5 వేలు అప్పు ఇప్పించగా ఎన్నికల బరిలో దిగానని అనంతరం మంత్రి రాజారాం రూ. 20 వేలు పార్టీ తరపున ఇచ్చారన్నారు. మొత్తం రూ. 24 వేలతో తాను శాసన సభ్యునిగా గెలుపొందానని 40 ఏళ్ల కిందటి తన జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. నేటి అభ్యర్థుల ఖర్చు చూస్తుంటే కళ్లు తిరిగిపోతున్నాయ ని తెలిపారు
నాడు తన వెంట మాలి పోచయ్య, అన్నెపల్లి రాజయ్య, డి.నారాయణ, ఎం.జనార్దన్, మేర పద్మయ్య, కటికె బాలోజి అనే కార్యకర్తలు వెంట ఉండి బస్సుల్లో, కాలినడకన గ్రామాలకు వెళ్లి ప్రచారం చేశామన్నారు. తనపై రెడ్డికాంగ్రెస్ తరపున కాటిపల్లి పెద్దరాజిరెడ్డి, స్వతంత్య్ర అభ్యర్థిగా ఎడ్లరాజిరెడ్డి పోటీ చేయగా వారిపై తాను 15వేల మెజారిటీతో గెలుపొందడం మర్చిపోలేని అనుభూతి అన్నారు.ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి తాను కనీసం హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రభుత్వం రూ. 20 వేలకు 600 గజాల జాగా కేటాయించగా డబ్బులు లేనందున దాన్ని కొనలేకపోయానని వివరించారు.
లంచగొండితనం, సేవా భావం లోపించడం, కులం, కుటుంబీకులు అనే ఆలోచనతో నా యకులు ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. నాయకులే ప్రజలను చెడగొడుతున్నారని ఎవరూ డబ్బులు ఇవ్వకుంటే మం చివారికే ఓట్లు వేస్తారన్నారు. 1982లో ఇందిరాకాంగ్రెస్ తరపున పోటీ చేయగా రూ. లక్ష వరకు ఖర్చయిందని, నాటి తెలుగుదేశం ప్రభంజనంలో ఓటమి చెందినట్లు బాలయ్య వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment