మానవ వనరులకు కొదవ లేదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: దేశంలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో భారత్ అగ్రభాగంలో నిలుస్తుందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో పేరుందని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. మానవ వనరుల నిర్వహణపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కార్మిక చట్టాలు మరింత కట్టుదిట్టం చేశామని చెప్పారు. కార్మిక చట్టాల్లో సవరణలు చేశామని, నియామకం నుంచి పదవీ విరమణ వరకు కార్మికులు లబ్ధిపొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల్లో వీటికి ఆమోదం లభిస్తుంద ని భావిస్తున్నామన్నారు. వేతన చెల్లింపులన్నీ డిజిటలైజ్ చేస్తున్నామని, కంపెనీల్లో ఇకపై కార్మికులు తమ వేతనాలను చెక్కులు, ఆన్‌లైన్‌లో తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.