కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
బీసీల అభ్యున్నతిపై కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో పనిచేస్తోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఇందులో దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి కేంద్రం ఓబీసీ కమిషన్ బిల్లును లోక్‌సభలో ఆమోదిస్తే.. ప్రతిపక్షాలు కుట్రలతో రాజ్యసభలో అడ్డుకున్నాయన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే బీసీలకు న్యాయం జరిగేదన్నారు.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి హామీ ఇచ్చినట్టు దత్తాత్రేయ తెలిపారు. ధర్నాకు సంఘీభావం తెలిపిన టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. దేశంలో మరో భారీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎంపీ బూర నరసయ్యగౌడ్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తానని చెప్పారు.
బీసీ వ్యతిరేక పార్టీలను ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు హెచ్చరించారు. దేశంలో 50 శాతంపైగా జనాభా ఉన్న బీసీలకు రాజకీయాల్లో కనీస రిజర్వేషన్లు లేకపో వడం అన్యాయమని జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.