రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా? | Bandaru Dattatreya Slams KTR And KCR | Sakshi
Sakshi News home page

రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?

Published Thu, Apr 4 2019 2:46 AM | Last Updated on Thu, Apr 4 2019 2:46 AM

Bandaru Dattatreya Slams KTR And KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంకేసీఆర్, కేటీఆర్‌కు బండారు దత్తాత్రేయ సవాల్‌లో బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతోందని, టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దానిని చూసి తట్టుకోలేకపోతున్న టీఆర్‌ఎస్‌ బీజేపీపై విమర్శలు చేస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లకు మించి రావని మాట్లాడుతున్నారని, 300 సీట్లతో మోదీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్‌ రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాల్‌ విసిరారు. గతంలో ఏరోజూ మోదీ గురించి, బీజేపీ గురించి మాట్లాడని కేసీఆర్‌ నేరుగా ప్రధానిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ వారు కేసీఆర్‌ ప్రధాని అంటూ పొగుడుతుంటే ఆయన మాత్రం నేను ప్రధాని అభ్యర్థిని కానని అంటుండటం ద్వంద్వ వైఖరని చెప్పారు. కేసీఆర్‌ చెప్పే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఒక అతుకులబొంతని, దేశ రాజకీయాల్లో ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎవరూ గుర్తించరని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలు చేయవద్దని చెప్పే కేసీఆర్, స్థాయి దిగజారి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, మోదీని విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని ఆయనే స్వయంగా అన్నారని, దానికి మీరు, మీ కుటుంబం బాధ్యులు కాదా? అని ప్రశ్నించారు.

నియంతృత్వ పోకడలతో కేసీఆర్‌ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి రూ.35 వేల కోట్లు గ్రాంట్స్‌ రూపంలో ఇచ్చిందన్నది వాస్తవమని, ఈ విషయంలో కేసీఆర్‌ రికార్డులను చూసుకోవాలన్నారు. కేంద్రం వివిధ పథకాలు, ఇతరత్రా మొత్తంగా రూ. 2.30 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని వివరించారు. జీఎస్‌టీ, ఐటీ కింద మేమే కేంద్రానికి ఇస్తున్నామని, కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది ముష్టి అని పేర్కొనడం పచ్చి అబద్ధమని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement