గల్లీకో ‘బెల్టు’! | Belt Shops Increasing In Telangana | Sakshi
Sakshi News home page

గల్లీకో ‘బెల్టు’!

Published Sun, Jul 1 2018 1:17 AM | Last Updated on Mon, Aug 20 2018 8:24 PM

Belt Shops Increasing In Telangana - Sakshi

గల్లీకో ‘బెల్టు’!

తుంగతుర్తి నుంచి వర్ధెల్లి వెంకటేశ్వర్లు
అదో మండల కేంద్రం.. 2 వేల పైచిలుకు కుటుంబాలు.. వ్యవసాయం, అనుబంధ వృత్తులపై ఆధారపడి పొట్టబోసుకునేవారే ఎక్కువ.. ఇక్కడ ప్రభుత్వం అనుమతించిన మద్యం షాపులు మూడంటే మూడే! కానీ అక్రమంగా వెలిసిన బెల్టుషాపులెన్నో తెలుసా.. 50కిపైనే!! ఇక ఆ మండల కేంద్రాన్ని ఆనుకొని 10 కిలోమీటర్ల పరిధిలో 12 గ్రామాలున్నాయి. ఆ పల్లెల్లో గల్లీకొకటి చొప్పున ఏకంగా 160కిపైగా బెల్టుషాపులు ఏర్పాటయ్యాయి. ఈ ఒక్క మండల కేంద్రం, దాని పరిధిలోని 12 పల్లెల్లో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా మొత్తం మద్యం దుకాణాల లెక్క 212గా తేలింది. ఇలా ఈ ఒక్క మండలంలోనే కాదు.. రాష్ట్రంలో చాలాచోట్లా ఇదే పరిస్థితి నెలకొంది. బెల్టు దుకాణాలు పల్లెల్లో గల్లీగల్లీకి పాకుతున్నాయి. ఒకప్పటి టీ కొట్లు, బడ్డీ కొట్లన్నీ ఇప్పుడు బెల్టు దుకాణాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనధికార లెక్కల ప్రకారం లక్షకుపైగా బెల్టు షాపులున్నట్టు సమాచారం. ప్రతి గ్రామంలో సగటున రోజుకు రూ.15 వేల విలువైన మద్యం వ్యాపారం సాగుతోంది. ఆరు నెలల కిందటి వరకు కొంత అదుపులోనే ఉన్న బెల్టు దుకాణాలు ఇటీవలి కాలంలో ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. 

‘బెల్టు’లెట్లా వెలుస్తున్నాయంటే.. 
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని లైసెన్స్‌డ్‌ మద్యం దుకాణాలు, బెల్టు దుకాణాలపై ‘సాక్షి’క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. దీనికి స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు సహకరించారు. తుంగతుర్తి మేజర్‌ గ్రామ పంచాయతీలో 2,775 కుటుంబాలు ఉండగా.. 8,500 జనాభా ఉంది. దీని చుట్టూ 10.కి.మీ. పరిధిలో కర్విరాల కొత్తగూడెం, బండరామారం, వెంపటి, పసునూరు, వెలుగుపల్లి, గానుగుబండ, అన్నారం, సంగెం, గొట్టిపర్తి, మానాపురం, రావులపల్లి పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాల నుంచి వివిధ పనుల కోసం రోజుకు కనీసం 800 నుంచి 1,000 మంది తుంగతుర్తి వస్తుంటారు. ఈ పట్టణంలో మూడు లైసెన్స్‌›డ్‌ మద్యం దుకాణాలు ఉండగా.. వాటిని అనుసంధానంగా 50 బెల్టు దుకాణాలు ఉన్నాయి. తుంగతుర్తి సరిహద్దు తూర్పున కట్టెకోత మిషన్‌ వద్ద నుంచి పడమర నాగారం రోడ్డు పెట్రోల్‌ బంకు వరకు ‘సాక్షి’ప్రతినిధి పరిశీలించారు.

ఈ మొత్తం నిడివి 1.6 కి.మీ. ఉండగా.. ఇందులోనే మూడు లైసెన్స్‌డ్‌ ఏ4 మద్యం దుకాణాలు, 11 బెల్టు దుకాణాలు కనిపించాయి. గతంలో ఈ దుకాణాల్లో చాయ్, చిన్నచిన్న తినుబండారాలు విక్రయించేవారని స్థానికులు పేర్కొన్నారు. తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌కు సుమారు 400 మీటర్ల దూరంలో పూలగడ్డ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు అన్నీ వ్యవసాయం, కుల వృత్తులపై ఆధారపడి బతుకుతున్న కుంటుంబాలే ఉన్నాయి. ఈ బజారులో 15 బెల్టు దుకాణాలు ఉన్నట్లు తేలింది. ఇవేగాకుండా పాత బడి సెంటర్లో 6, తూర్పువాడలో 8 చొప్పున బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి. మొత్తంగా తుంగతుర్తిలో 50, అన్నారం 30 వెంపటిలో 20, సంగెంలో 10, వెలుగుపల్లిలో 22, రావులపల్లిలో 10, గొట్టిపర్తిలో 19, గానుగుబండ 10, తూర్పుగూడెంలో 8, బండరామారంలో 20, కొత్తగూడెంలో 8, మానాపురం 5 చొప్పున 212 బెల్టు దుకాణాలు ఉన్నట్లు లెక్క తేలింది. 

40 గ్రామాలు.. 18 రేషన్‌ దుకాణాలు 
తుంగతుర్తి మండల పరిధిలో 12 గ్రామపంచాయతీలకు అనుబంధంగా 28 ఆవాసాలు కలిపి మొత్తం 40 గ్రామాలున్నాయి. ప్రజలకు నిత్యావసరాలు అందించే రేషన్‌ దుకాణాలు మాత్రం కేవలం 18 గ్రామాల్లోనే ఉన్నాయి. ఇందులో రావులపల్లి గ్రామానికి రేషన్‌ డీలర్‌ పోస్టు ఖాళీగా ఉండగా.. గొట్టిపర్తి రేషన్‌ డీలర్‌కు ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇక వైద్యం విషయానికి వస్తే దాదాపు 35 వేల పైచిలుకు జనాభా ఉన్న తుంగతుర్తి మండలంలో ఒకే ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. వెలుగుపల్లి, వెంపటి, సంగెం, గొట్టిపర్తి గ్రామాల్లో మాత్రమే ఆరోగ్య ఉప కేంద్రాలున్నాయి. 

ఎమ్మార్పీ ఏది? 
తుంగతుర్తిలోని మూడు లైసెన్స్‌›డ్‌ మద్యం దుకాణాల యాజమాన్యాలు సిండికేట్‌ అయ్యాయి. రెండు దుకాణాల్లో రిటెయిల్‌గా విక్రయిస్తుండగా.. గాంధీ బొమ్మకు సమీపంలో ఉన్న ఓ మద్యం దుకాణం నుంచి పూర్తిగా బెల్టుషాపులకే మద్యం విక్రయిస్తున్నారు. రిటెయిల్‌ దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన లేదుగానీ బెల్టు దుకాణాలకు మాత్రం ఫుల్లుకు రూ.40, క్వార్టర్‌కు రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టు షాపుల్లో రిటెయిల్‌ విక్రయ దుకాణాల్లో జరిగే రోజువారి గిరాకీకి నాలుగు రెట్లు ఎక్కువ బిజినెస్‌ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బెల్టు దుకాణాలపై అటు ఎక్సైజ్‌ కానీ, ఇటు పోలీసులు కానీ దాడులు చేయకుండా చూసుకునే బాధ్యత లైసెన్స్‌›డ్‌ దుకాణాల సిండికేటుదే. స్థానిక పోలీసులకు రూ.20 వేలు, ఎక్సైజ్‌ పోలీసులకు రూ.8 వేల చొప్పున నెలనెలా మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

నిబంధనలేం చెబుతున్నాయి? 
ఎక్సైజ్‌ నింబంధనల ప్రకారం టీఎస్‌బీసీఎల్‌ (తెలంగాణ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌) నుంచి ఒక దుకాణానికి కేటాయించిన మద్యం సీసాలను వేరొక దుకాణం నుంచి విక్రయించటం నేరం. మద్యం మార్పిడి విక్రయాలు చేస్తూ పట్టుబడిన దుకాణానికి 9 రోజుల పాటు లైసెన్స్‌ను రద్దు చేసి, రూ.2 లక్షల జరిమానా విధిస్తారు. ఇదే కేసులో పదేపదే పట్టుబడితే లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేస్తారు. కానీ ఇక్కడ బహిరంగంగానే ఒక దుకాణం మద్యం మరో దుకాణంలో విక్రయిస్తున్నారు. మామూళ్లు తీసుకొని స్థానిక, ఎక్సైజ్‌ పోలీసులతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. 

నడుపుతోంది యువతే.. 
బెల్టు దుకాణాలు నిర్వహిస్తున్న కుటుంబాల్లో 80 శాతం మంది పదో తరగతి నుంచి డిగ్రీలోపు చదువుకున్న యువతే ఉంది. చదివిన చదువులకు ఉద్యోగాలు రాక, వ్యవసాయ పనులు చేసుకోలేక మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్నామని తుంగతుర్తికి చెందిన ఓ యువకుడు చెప్పాడు. రూ.4 వేల నుంచి రూ.5 వేల పెట్టుబడి పెడితే అన్నీ ఖర్చులు పోనూ రోజుకు కనీసం రూ.600 నుంచి రూ.800 వరకు మిగులుతాయని వెలుగుపల్లి గ్రామనికి చెందిన బెల్టు దుకాణం నిర్వాహకుడు తెలిపారు. 16 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు, వ్యవసాయం, అనుబంధ వృత్తులపై ఆధారపడి రోజూ కష్టం చేసుకునే వారే ఎక్కువగా మద్యం తాగుతున్నారు. తుంగతుర్తికి చెందిన ఓ మహిళను పలకరించగా.. ‘‘ఇక్కడే 50కి పైగా బెల్టు దుకాణాలు నడుస్తున్నాయి సార్‌.. ఈడు మీదున్న పిల్లలే ఎక్కువగా తాగుతున్నరు’’అని చెప్పారు. మరికొందరు మహిళలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement