పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు బాణోత్ రత్నా
సుజాతనగర్ : సమయపాలన.. అంకిత భావం, సామాజిక సేవ.. పరమావధిగా ఓ గిరిజన ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. 29 ఏళ్లుగా ప్రభుత్వ టీచర్‌గా విద్యార్థుల ఉన్నతికి పాటుపడుతున్నారు బాణోత్ రత్నా. 2011 నుంచి 2018 వరకు సుజాతనగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాద్యాయుడిగా పనిచేసిన రత్నా ఇటీవల జరిగిన ఉపాధాయ బదిలీల్లో సర్వారం ప్రాథమిక పాఠశాలకు బదిలీపై వచ్చారు. ఆయన పాఠశాలకు వచ్చే నాటికి బడిలో 26 మందే విద్యార్థులు ఉన్నారు. వీరిలో 20 మంది మాత్రమే పాఠశాలకు వస్తున్నారు.
ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రత్నా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బడిలోకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించారు. ఇప్పుడు 26 మందీ పాఠశాలకు రావడంతోపాటు మరో 14 మందిని అదనంగా పాఠశాలలో చేర్చారు. ప్రస్తుతం సర్వారం పాఠశాలలో 40 మంది విద్యార్థులు చదువుతన్నారు. వీరందరూ గిరిజన పిల్లలే. ఆంగ్లంపై పట్టులేకపోవడంతో ప్రత్యేక తరగతులు నిర్వహించి.. పట్టు సాధించేలా కృషి చేస్తున్నారు. ఏకాగ్రత పెంపొందించేందుకు విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు.
సెలవు రోజుల్లోనూ బడి..
అవకాశం దొరికితే చాలు..విధులకు డుమ్మా కొట్టే ఉపాధ్యాయులున్న నేటి రోజుల్లో సెలవు రోజున కూడా పాఠశాల నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నెలలో 24న వరలక్ష్మీ వ్రతం, రెండో శనివారం, ఆదివారం, జెండా వందనం, వాజ్‌పేయి మృతి తదితర 12 రోజులు సెలవులు వచ్చాయి. కానీ రత్నా విద్యార్థుల అభ్యున్నతి కోసం సెలవు రోజుల్లో కూడా పాఠశాల నిర్వహించారు. సెలవు కావడంతో మధ్యాహ్నం ప్రతీ రోజు మధ్యాహ్నం వడ్డించే అక్షయపాత్ర సంస్థ భోజనం ఏర్పాటు చేయకపోవడంతో ఈ నెల 24న వరలక్ష్మీ వ్రతం రోజు సొంత ఖర్చులతో భోజనం తయారు చేయించి పెట్టారు.
గతంలో పనిచేసిన పాఠశాలలోనూ..
రత్నా సుజాతనగర్ మండల పరిషత్ పాఠశాలలో 2011 నుంచి ఇటీవల బదిలీల వరకు పనిచేశారు. ఆయన రాకముందు పాఠశాలలో విద్యార్థులు కేవలం 45 మందే ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 200కు పెరిగింది. సొంత ఖర్చులతో విద్యార్థులు భోజనం చేసేందుకు షెడ్ నిర్మించారు.
గోడలూ పాఠాలు చెబుతాయి
గతంలో ఆయన పనిచేసిన సుజాతనగర్ పాఠశాలలో గోడలను అందంగా ముస్తాబు చేసి చక్కని రంగులతో వివిధ కళాకృతులను వాటిపై తీర్చిదిద్దారు. జాతీయ నాయకులు చిత్రపటాలు, వివేకానందుని సూక్తులు, తెలంగాణ తల్లి, ఆచార్య జయశంకర్, సరçస్వతి చిత్రపటాలతో పాటు, స్వచ్ఛ భారత్ లోగో, భారతదేశం, తెలంగాణ రాష్ట్ర చిత్రపటాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు రాష్ట్ర పుష్పం, రాష్ట్ర పిట్ట, రాష్ట్ర చెట్టు, రాష్ట్ర జంతువుల చిత్రపటాలను ఏర్పాటు చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ పలువురు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవార్డులు
1998లో జూలూరుపాడు మండలం కరివారిగూడెం పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు.
2004లో క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం(క్యూఐటీ) జిల్లా స్థాయిలో ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment