
సంఘటనాస్థలిలో భయానక దృశ్యాలు
మరిన్ని పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందని పోలీసులు..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలిలో గల నానక్‌రాంగూడాలో శుక్రవారం సాయంత్రం శక్తిమంతమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మాణంలో ఉన్న ఫొనెక్స్ భవనంలో ఈ పేలుడు జరిగింది. పేలుడి ధాటికి పక్కనే ఉన్న లారీ, జేసీబీలు ధ్వంసం అయ్యాయి. దగ్గరలో ఉన్న అపార్ట్‌మెంటుకు పగుళ్లు ఏర్పడ్డాయి. అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో అందులోని వారికి గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. కొండ ప్రాంతంలో నిర్మాణం కావడంతో రాళ్లను పగుల గొట్టేందుకు పేలుడు పదార్థాలను అమర్చివుంటారని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా పగటి పూట పేలుడు పదార్థాలు వినియోగించడంపై అనుమానాలు కలుగుతున్నాయి. భవన నిర్మాణ సైట్‌లో మరిన్ని పేలుడు పదార్థాలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శక్తిమంతమైన పేలుడు పదార్థాలు కావడంతో లోపలికి వెళ్లకుండా, బాంబు స్క్వాడ్ వచ్చేవరకూ వేచి చూడాలని నిర్ణయించారు.
పుప్పాల గూడ ఫినిక్స్ సెజ్‌లో ఈ పేళుల్లు జరిగాయి. బ్లాస్టింగ్ వల్ల ఈ పేళుల్లు జరగలేదు. పేలుడు సామాగ్రి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. అందుకే టిప్పర్‌తో సహా ఆ ప్రాంతంలో ధ్వంసమయ్యాయి. సురేష్ అనే సూపర్ వైజర్, రమేష్ అనే డ్రైవర్‌లకు గాయాలయ్యాయి. వారిని కాంటినెంటల్ హాస్పిటల్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేశాం. పేళుల్ల కోసం ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనేది చెక్ చేస్తున్నాం.
-మదాపూర్ డీసీపీ. వెంకటేశ్వర్ రావు